ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 మార్చి 2024 (14:03 IST)

ఆయన వయసు 93 యేళ్లు... ఐదో పెళ్లికి సిద్ధమైన రూపర్ట్ మర్దోక్...

Rupert Murdoch
ప్రముఖ ఆస్ట్రేలియా - అమెరికన్ పారిశ్రామికదిగ్గజం రూపర్ట్ మర్దోక్ మరోమారు పతాకశీర్షికలకు ఎక్కారు. 93 యేళ్ల వయసులో మరో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలే తన ప్రియురాలు 67 ఏళ్ల ఎలీనా జుకోవాతో ఆయన నిశ్చితార్థం చేసుకున్నట్టు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. వచ్చే జూన్ నెలలో కాలిఫోర్నియాలోని మర్దోక్‌ ఎస్టేట్‌లో వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆహ్వానాలు కూడా పంపించారట. ఈ బిలియనీర్‌కు ఇది ఐదో వివాహం కాగా.. ఆరోసారి ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. గతేడాది ఆన్‌ లెస్లీ స్మిత్‌తో ఎంగేజ్‌మెంట్‌ జరగ్గా.. నెల వ్యవధిలోనే ఆ బంధానికి ముగింపు పలికారు.
 
ఆ తర్వాత కొన్ని నెలలకు తన మాజీ భార్యల్లో ఒకరైన విన్‌డీ డెంగ్‌ ఇచ్చిన పార్టీలో మర్దోక్‌కు జుకోవా పరిచయమయ్యారు. అప్పటి నుంచి డేటింగ్‌లో ఉన్న వీరు.. త్వరలోనే వివాహం చేసుకోనున్నారు. రష్యాకు చెందిన జుకోవా అమెరికాకు వలస వచ్చారు. గతంలో ఆమెకు మాస్కో ఆయిల్‌ బిలియనీర్‌ అలెగ్జాండర్‌తో వివాహమైంది. వీరి కుమార్తె దాషా.. రష్యన్‌ ఓలిగార్క్‌ను పెళ్లి చేసుకుని విడిపోయారు.
 
మర్దోక్‌ మొదట ఆస్ట్రేలియాకు చెందిన పాట్రిషియా బుకర్‌ను వివాహమాడారు. 1960ల్లో వీరి బంధం ముగిసిపోయింది. ఆ తర్వాత జర్నలిస్ట్‌ అన్నా మరియా మన్‌, చైనా వ్యాపారవేత్త విన్‌డీ డెంగ్‌, అమెరికా మోడల్‌ జెర్రీ హాల్‌తో విడాకులు తీసుకున్నారు. తన రెండో భార్య నుంచి విడిపోయిన సందర్భంలో ఆయన చెల్లించిన భరణం.. అత్యంత ఖరీదైన భరణాల్లో ఒకటిగా నిలిచింది. ఆ సమయంలో ఆమెకు 1.7 బిలియన్‌ డాలర్ల ఆస్తి ఇచ్చినట్లు సమాచారం.
 
1950ల్లో మీడియా కెరీర్‌ను ఆరంభించిన మర్దోక్‌.. న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌, ది సన్‌ వార్తా పత్రికలను ప్రారంభించారు. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడి న్యూయార్క్‌ పోస్ట్‌, వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ వంటి పబ్లికేషన్స్‌ను కొనుగోలు చేశారు. 1996లో ఫాక్స్‌ న్యూస్‌ను ప్రారంభించారు. 2013లో న్యూస్‌కార్ప్‌ను స్థాపించారు. మర్దోక్‌ తన కెరీర్‌లో అనేక వివాదాలు ఎదుర్కొన్నారు. 2011లో ఫోన్‌ హ్యాకింగ్‌ కుంభకోణం కారణంగా న్యూస్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ పత్రికను మూసివేయాల్సి వచ్చింది. గతేడాది సెప్టెంబరులో తన వ్యాపార సామ్రాజ్యాన్ని కుమారులకు అప్పగించారు. ప్రస్తుతం తన సంస్థలకు గౌరవ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.