సౌతాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాకు జైలుశిక్ష
అవినీతి కేసులో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాకు జైలు శిక్ష పడింది. ఈ మేరకు దేశ సుప్రీంకోర్టు 15 నెలల జైలుశిక్షను విధించింది. దేశాధ్యక్షుడుగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలపై జరుగుతున్న విచారణకు జుమా హాజరు కాలేదు.
దీంతో న్యాయమూర్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ఈ శిక్షను విధించారు. ఆయన కోర్టును ధిక్కరించారని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. జుమా ఏదైనా పోలీస్ స్టేషనులో ఐదు రోజుల్లోగా లొంగిపోవాలని లేకుంటే, అరెస్టుకు ఆదేశాలు జారీ చేస్తామని ఆయన అన్నారు.
2009 నుంచి 2018 వరకూ తొమ్మిది ఏండ్లపాటు సాగిన జుమా పాలనలో భారీగా అవినీతి చోటుచేసుకుందని, ఆయన ప్రభుత్వ ఖజానాను దోచుకున్నారని ఆరోపిస్తూ గతంలో కేసు నమోదైంది. దీనిపై దర్యాప్తు జరుపుతున్న కమిషన్ ముందు ఆయన హాజరుకాకపోవడంతో శిక్షకు గురయ్యారు. కాగా, ప్రస్తుతం 79 సంవత్సరాల వయసులో ఉన్న జుమా, 2009 నుంచి 2018 వరకూ అధ్యక్షుడిగా పనిచేశారు.