1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 21 మే 2022 (17:25 IST)

శ్రీలంకలో అత్యవసర పరిస్థితిని ఎత్తివేసిన ప్రభుత్వం

Srilanka-PM
ఆర్థిక సంక్షోభంలో కూరుకుని ప్రజల తిరుగుబాటులో ఎమర్జెన్సీలోకి వెళ్లిన శ్రీలంకలో పరిస్థితులు ఇపుడిపుడే చక్కబడుతున్నాయి. దీంతో గత రెండు వారాలుగా అమల్లో ఉన్న అత్యవసర పరిస్థితిని ఆ దేశ ప్రభుత్వం ఎత్తివేసింది. పైగా, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. 
 
తీవ్ర ఆర్థిక సంక్షోభం కోరల్లో చిక్కుకున్న శ్రీలంక.. ప్రజలకు నిత్యావసరాలను కూడా అందించలేని దయనీయ స్థితిలోకి వెళ్లింది. ఇప్పటికే అలాంటి గడ్డు పరిస్థితులే నెలకొనివున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన బాటపట్టారు. వారిని అదుపు చేసేందుకు వీలుగా ఎమర్జెన్సీని విధించారు. మే ఆరో తేదీ నుంచి అమల్లోకి తెచ్చారు. హింసాత్మక చర్యలకు పాల్పడేవారిని నిర్బంధంలోకి తీసుకునేందుకు పోలీసులు విశేష అధికారాలను కల్పిస్తూ ఆ దేశ అధ్యక్షుడు గొటబాయి రాజపక్స ఉత్తర్వులు జారీచేశారు. 
 
అయితే ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో దేశంలో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయని భావించిన దేశాధ్యక్షుడు ఎమర్జెన్సీని ఎత్తివేసినట్టు స్థానిక మీడియా హిరు న్యూస్ వెల్లడించింది. కాగా, ప్రజా తిరుగుబాటుతో ఆ దేశ ప్రధానిగా ఉన్న మహీందా రాజపక్స తన పదవికి రాజీనామా చేయగా, ఆయన స్థానంలో రణిల్ విక్రమ సింఘే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు.