శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 15 ఫిబ్రవరి 2020 (19:07 IST)

చికెన్ లెగ్‌పీస్‌లపై తగ్గేది లేదు: తేల్చి చెప్పిన ట్రంప్ (video)

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి భారత్ వస్తున్న సందర్భంగా ఇరు దేశాల మధ్య జరిగే వాణిజ్య ఒప్పందాలపై విశేష ఆసక్తి నెలకొంది.

ప్రత్యేకించి చికెన్ లెగ్ పీస్‌లు, డైరీ ఉత్పత్తులు, హార్లీ డేవిడ్సన్ బైక్స్ తదితర అమెరికా దిగుమతులపై భారత్ విధించిన సుంకాలపై ఇన్నాళ్లు గుర్రుగా ఉన్న ట్రంప్.. తాజా పర్యటనలో వీటినే ప్రధానంగా తెరమీదికి తీసుకొచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

భారత్ ఇప్పటికే పలు అమెరికా ఉత్పత్తుల దిగమతులపై నిబంధనలు సడలించేందుకు అంగీకరించిందని చెబుతున్నారు. పరిమిత వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసేలా ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవడం కోసం పౌల్ట్రీ, డైరీ మార్కెట్లకు పాక్షికంగా ద్వారాలు తెరిచేందుకు భారత్ అంగీకరించినట్టు సమాచారం.

ఈ నెల 24, 25 తేదీల్లో ట్రంప్ భారత్‌లో పర్యటించనున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా పాలను ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్ అగ్ర స్థానంలో ఉంది.

దేశంలో దాదాపు ఎనిమిది కోట్ల కుటుంబాలు పాడి మీదనే ఆధారపడి జీవనం సాగిస్తుండడంతో.. వారి ప్రయోజనాలు కాపాడటం కోసం అమెరికా డైరీ మార్కెట్‌కు తలుపులు తెరిచేందుకు భారత్ తటపటాయిస్తోంది. 
 
అమెరికా చికెన్ లెగ్ పీస్‌లపై ప్రస్తుతం విధిస్తున్న 100 శాతం సుంకాలను 25  శాతానికి తగ్గించేందుకు భారత్ అంగీకరించిందనీ.. వీటితో పాటు టర్కీ కోళ్లు, బ్లూ బెర్రీలు, చెర్రీల దిగుమతులకు కూడా ఓకే చెప్పిందని అధికార వర్గాలు వెల్లడించాయి.

అయితే చికెన్ లెగ్‌పీస్‌లపై 10 శాతం వరకు సుంకాలు తగ్గించాలంటూ అమెరికా పట్టుపడుతున్నట్టు తెలుస్తోంది. ఇక అమెరికా నుంచి దిగుమతి అయ్యే డైరీ ఉత్పత్తులపై 5 శాతం సుంకాలు విధించనున్నట్టు భారత్ తన ప్రతిపాదనల్లో పేర్కొన్నట్టు సమాచారం.

అయితే దిగుమతి అయ్యే పాల ఉత్పత్తులు మాంసాహారం తినే జంతువుల నుంచి ఉత్పత్తి చేసినవి కావంటూ సర్టిఫికెట్ చూపిస్తేనే వాటిని అనుమతిస్తారు.
 
కాగా అమెరికా హార్లీ డేవిడ్సన్ మోటార్స్‌పై విధిస్తున్న 50 శాతం దిగుమతి సుంకాలను కూడా తగ్గించేందుకు భారత్ అంగీకరించినట్టు సమాచారం.

మోటార్ బైక్‌లపై భారత్ విధిస్తున్న సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటూ గతేడాది జూన్‌లో భారత్‌పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే.