పిల్లల్ని కంటే ఐదేళ్ళలో రూ.5 లక్షలు ప్రోత్సాహక బహుమతి
తమ వద్ద పని చేసే ఉద్యోగులకు ఓ చైనా కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వారు చేయాల్సిందిల్లా ఒక్కటే. పిల్లల్ని కనడమే. ఇలా పిల్లల్ని కంటే తొలి ఐదేళ్లలో రూ.5 లక్షలు చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతిని అందిస్తామని ప్రకటించింది. ఈ పథకం లక్ష్యం.. చైనాలో ఎక్కువ మంది పిల్లల్ని కనేలా ప్రోత్సహించడమే ఈ సరికొత్త పథక విధానం. భారతీయ కరెన్సీలో యేడాదికి రూ.1.1లక్షల చొప్పున ప్రోత్సాహక బహుమతిని అందిస్తారు.
చైనాలో అతిపెద్ద ట్రావెల్ కంపెనీగా గుర్తింపు పొందిన ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీ ట్రిప్ డాట్ కామ్. చైనాలో యువత సంఖ్య బాగా తగ్గిపోయింది. వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. దీంతో చైనా పాలకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో అధిక సంఖ్యలో పిల్లల్ని కనాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఇందులోభాగంగా, ఈ ఆన్‌లైన్ కంపెనీ కూడా తమ వద్ద పని చేసే ఉద్యోగులకు ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది.
కంపెనీలో పని చేసే ఉద్యోగులు పిల్లల్ని కంటే ఒక్కో శిశువుకు యేడాదికి 11000 యువాన్లు చొప్పున వార్షిక బోనస్‌గా ఐదేళ్లపాటు చెల్లిస్తామని పేర్కొంది. ఇది భారత కరెన్సీలో రూ.1.1 లక్షలు. ఆ లెక్కన ఒక శిశువుకు ఐదేళ్లలో రూ.5.6 లక్షల నగదును అందజేయనుంది. ఈ ఆఫర్‌ను జూన్ 30వతేదీన ప్రకటించగా, జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. తమ కంపెనీలో మూడేళ్లు అంతకంటే ఎక్కువ కాలంగా పని చేస్తున్న ఉద్యోగులకు ఈ కొత్త చైల్డ్ కేర్ బెనిఫిట్ ప్రయోజనం చేకూరనుంది.