ట్రంప్‌కు కరోనా.. మాస్కు అంటే ఎగతాళి చేశారు.. చివరికి పెద్దన్న ప్రచారానికి దూరం..!
అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్ శ్వేతభవనంలోనే క్వారంటైన్‌లో ఉంటారు. వైట్ హౌస్ అధికారులు కూడా క్వారంటైన్‌లో వున్నారు. శుక్రవారం ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్ అని తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక రోజు ముగిసేసరికి ట్రంప్ దంపతులు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. కరోనా అంటే ఏమాత్రం లెక్క చేయకుండా వ్యవహరించిన డొనాల్డ్ ట్రంప్ చివరికి ఆ కరోనా బారినే పడి కీలక సమయంలో అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి దూరమైపోయారు.
అధ్యక్ష ఎన్నికలకు సరిగ్గా నెలరోజుల ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ బారినపడ్డారు. 74 ఏళ్ల ట్రంప్ వయసు, అధిక బరువు వంటి కారణాలతో కోవిడ్-19 రోగుల్లో అధిక ముప్పున్న కేటగిరీగానే పరిగణించాలి. కాగా అటు ముంచుకొస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు తరుణంలో ట్రంప్ వైరస్ బారిన పడటంతో రిపబ్లికన్ పార్టీ ఆందోళన పడిపోయింది.
ప్రధాన ప్రత్యర్థి బైడెన్ ప్రచారంలో దూసుకుపోతూ, సవాలు విసురుతోంటే.. ట్రంప్ మహమ్మారి సోకి క్వారంటైన్ నిబంధనలకు పరిమితం కావడం భారీ ప్రభావాన్ని చూపనుందని భావిస్తున్నాయి. కరోనాకు పెద్దగా భయపడాల్సిన పనిలేదని చెబుతూ వచ్చిన అగ్రరాజ్యాధిపతి స్వయంగా దాని బారిన పడ్డారు. మాస్కు పెట్టుకోవడాన్ని ఎగతాళి చేస్తూ వచ్చిన పెద్దన్న చివరకు క్వారంటైన్ గూటికి తర్వాత ఆసుపత్రికి చేరారు.
అధ్యక్షుడు ట్రంప్ వైరస్‌ను ఎదుర్కొన్న తీరుకు ఈ ఎన్నికలు రెఫరెండంగా భావిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఆయన భార్య మెలానియాకు కరోనా వైరస్ సోకడం అధ్యక్ష ఎన్నికలపై చర్చ ఉత్కంఠభరితంగా మారింది.