శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 అక్టోబరు 2021 (07:59 IST)

ఏడ్చినందుకు కూడా బిల్లు ఆస్పత్రి యాజమాన్యం

అమెరికాలో ఓ ఆస్పత్రి చేసిన పని ప్రతి ఒక్కరూ నవ్వుకుంటున్నారు. పుట్టుమచ్చలను తొలగించుకునేందుకు ఆస్పత్రిలో చేర్చిన యువతి ఆపరేషన్ భయంతో ఏడ్చినందుకు కూడా బిల్లు వేసింది. ప్రస్తుతం ఈ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అమెరికాలో మిడ్జ్ అనే యువతి ఆసుపత్రికి వెళ్లింది. ఒక పుట్టుమచ్చ (మోల్) తొలగించుకోవడానికి చేరగా, ఆపరేషన్ చేసి పుట్టుమచ్చ తొలగించారు. ఆపరేషన్ సమయంలో భయమేసిన ఆమె ఏడ్చింది. ఆ తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయింది. డిశ్చార్జి సమయంలో ఆమెకు బిల్లు వేశారు. ఆ బిల్లు చూసిన ఆమెకు ఆశ్చర్యమేసింది.
 
ఎందుకంటే ఆ బిల్లులో ఆమె ఏడ్చినందుకు కూడా బిల్లు వేశారు. దీన్ని ఫొటో తీసిన ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాన్ని చూసిన నెటిజన్లు అమెరికా ఆరోగ్య వ్యవస్థపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ వ్యవస్థ గురించి అందరికీ అవగాహన కల్పించేందుకే ఈ ఫొటో షేర్ చేసినట్లు చెప్పింది. 
 
ఏడ్చినందుకు కూడా బిల్లు వేస్తారని తను అసలు ఊహించలేదని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ బిల్లు ఒక్కటి చాలు అమెరికన్ హెల్త్‌కేర్ వ్యవస్థ ఎలా ఉందో చెప్పడానికి అని కొందరు కామెంట్ చేస్తుంటే మరికొందరేమో 'ఇంతకాలం నేను ఫ్రీగా ఏడ్చానని అనుకున్నా' అంటూ జోకులు పేలుస్తున్నారు.