శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 23 మార్చి 2017 (07:47 IST)

కంటి చూపుతో చంపెయ్యలేదు.. నోటి అరుపుతో పులిని తరిమిన తల్లి

చిరుతపులిలా మీద పడింది అనే సామెతను ఎన్నోసార్లు అందరం విని ఉంటాం. తన వాళ్లకు ఏదయినా ఆపద వచ్చినా, అడ్డంకి ఎదురైనా, ప్రాణాపాయమే వచ్చినా శివంగిలా మీదపడి తనవాళ్లను కాపాడుకునే ధైర్యం మహిళలకు ఆ క్షణంలో ఎలా వస్తుందో తెలీదు కానీ ఒక తల్లి నిజంగానే చిరుతపులినే

చిరుతపులిలా మీద పడింది అనే సామెతను ఎన్నోసార్లు అందరం విని ఉంటాం. తన వాళ్లకు ఏదయినా ఆపద వచ్చినా, అడ్డంకి ఎదురైనా, ప్రాణాపాయమే వచ్చినా శివంగిలా మీదపడి తనవాళ్లను కాపాడుకునే ధైర్యం  మహిళలకు ఆ క్షణంలో ఎలా వస్తుందో తెలీదు కానీ ఒక తల్లి నిజంగానే చిరుతపులినే ఎదురించి తన బిడ్డను కాపాడుకున్న వైనం సంచలన గాథ అయింది.
 
విషయంలోకి వస్తే...మహారాష్ట్రలో ఓ తల్లి ధైర్యంతో చిరుతను ఎదుర్కొంది. దాని ముఖంపై పంచ్‌లిచ్చి మరీ కుమారుడ్ని కాపాడుకుంది. ఉత్తర ముంబైలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సంజయ్ గాంధీ నేషనల్ పార్కు సమీపంలోని గిరిజన తండాకు చెందిన ప్రమీల రిన్జాడ్, సోమవారం రాత్రి 9 గంటలకు మూత్ర విసర్జన కోసం గుడిసె నుంచి బయటకు వచ్చింది. అయితే మూడేళ్ళ కుమారుడు ఆమెకు తెలియకుండా వెనకే వచ్చాడు. అక్కడే పొదల్లో ఉండి మాటుగాస్తున్న చిరుత ఒక్కసారిగా బాలుడిపై దాడి చేయడానికి లంఘించంది.
 
మూడేళ్ల బాలుడు తన ప్రాణ భక్షకిని చూసి హడలిపోయి ఏడ్చేశాడు. పులి గాండ్రింపులు ఆమెను వణికించలేదు. ఏ మాత్రం భయపడక చిరుతను ధైర్యంగా ఎదుర్కొంది. దాని ముఖంపై పిడిగుద్దులు కురిపించి పెద్దగా కేకలు వేసింది. ఆమె కొట్టిన దెబ్బలకంటే ఆమె అరిచిన అరుపులకే  అంత పెద్ద పులీ అడవిలోకి పారిపోయింది. ఇంతలో చుట్టుపక్కల వారు అక్కడకు వచ్చారు. స్వల్పంగా గాయపడిన బాబుకు చికిత్స అందించారు. కుమారుడ్ని కాపాడేందుకు ఆ తల్లి చేసిన సాహసాన్ని స్థానికులు కొనియాడారు.
 
అడవి జంతువులకు, క్రూర జంతువులకు సంబంధించిన రహస్యాన్ని  ఆ తల్లి బాగా గ్రహించినట్లుంది. పెద్దగా చప్పుడు చేస్తే ఏ జంతువైనా హడలి తన స్థానంనుంచి ఒక్కసారిగా కదిలిపోతుంది. ఆ ఎరుకే ఆ తల్లిని తన కుమారుడిని కాపాడుకునే ధైర్యాన్నివ్వడం విశేషం.