సెప్టెంబరు 14తో ముగియనున్న ఆధార్ అప్డేట్ గడువు.. పొడగింపుపై సందిగ్ధత!
ఆధార్ కార్డు అప్డేట్ గడువు పొడగింపు ఉన్న గడువు సెప్టెంబరు 14వ తేదీతో ముగియనుంది. అయితే, ఈ గడువును పొడగించే అంశంపై కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్రాల్లో ప్రభుత్వ సేవలు పొందేందుకు, వ్యక్తిగత గుర్తింపు నిర్ధారణకు అత్యంత ప్రామాణికంగా ఆధార్ కార్డును తీసుకుంటున్నారు. దీంతో ఆధార్ కార్డులోని తప్పొప్పులను సరిచేసుకునేందుకు యూఐడీఏఐ ప్రస్తుతం ఉచితంగా సౌలభ్యం కల్పిస్తోంది. ఈ ఉచిత సర్వీస్ గడువు సెప్టెంబరు 14తో ముగుస్తుంది. ఇప్పటికే యూఐడీఏఐ పలుమార్లు ఈ గడువును పొడగించింది. దీంతో మరోసారి పెంచుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. కాబట్టి ఉచితంగా ఆధార్‌ను అప్డేట్ చేసుకోవాలనుకునేవారు ఈ నిర్ణీత గడువులోగా అప్డేట్ చేసుకోవాల్సివుంటుంది.
కాగా ఆధార్ ఉచిత అప్డేట్ గడువును యూఐడీఏఐ అనేకసార్లు పొడిగించింది. మరోసారి పొడగింపుపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ప్రస్తుతం కొనసాగుతున్న గడువును జూన్ 14న మూడు నెలలపాటు పెంచింది. అంతకుముందు గతేడాది డిసెంబర్ 15 నుంచి ఈ ఏడాది మార్చి 14 వరకు పొడగించింది. ఆధార్ కార్డ్ వినియోగదారులు గుర్తింపు ఆధారాలు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు సమర్పించి ఆధార్‌ను ఆన్‌లైన్‌లో అప్డేడేట్ చేసుకోవచ్చు.
గత పదేళ్లలో ఆధార్‌లో చిరునామాను అప్డేట్ చేసుకోకుంటే ఎలాంటి ఛార్జీలు లేకుండానే అప్డేట్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ఇందుకోసం ఆధార్‌తో అనుసంధానమైన రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ ఉండాలి. దానికి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆధార్‌లో పేరు, మొబైల్ నంబర్, ఫోటో వంటి ఇతర వివరాలను అప్డేట్ చేసుకోవాలంటే యూఐడీఏఐ అధికారిక కేంద్రాలను సందర్శించాల్సి ఉంటుంది. కాగా యూఐడీఏఐ మార్గదర్శకాల ప్రకారం వినియోగదారులు ప్రతి 10 ఏళ్ల తర్వాత ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలి.