గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : శనివారం, 8 అక్టోబరు 2016 (15:01 IST)

స్మార్ట్‌ఫోన్లు,ట్యాబ్‌లు లక్ష్యంగా... యువకులను టార్గెట్ చేసిన కి'లేడీ'

న్యూఢిల్లీకి చెందిన ఓ కి'లేడి' తన అందం, అభినయంతో మగాళ్లతో పరిచయం పెంచుకుంటూ తాను గొప్ప ధనవంతురాలిగా చెప్పుకునేది. అందమైన దుస్తులు, బంగారు ఆభరణాలు ధరించి, హోండా బ్రయో కారులో తిరిగేది. ఇంగ్లీషులో అనర్గళ

న్యూఢిల్లీకి చెందిన ఓ కి'లేడి' తన అందం, అభినయంతో మగాళ్లతో పరిచయం పెంచుకుంటూ తాను గొప్ప ధనవంతురాలిగా చెప్పుకునేది. అందమైన దుస్తులు, బంగారు ఆభరణాలు ధరించి, హోండా బ్రయో కారులో తిరిగేది. ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడుతూ... ఖ‌రీదైన వ‌స్తువులు కాజేసి పారిపోయేది. ఓ 25 ఏళ్ల యువ‌తి చేస్తోన్న ఈ మోసం ఇటీవ‌లే వెలుగుచూసింది. 
 
ఈ వెరైటీ దొంగ యువతి బాధితులంతా పోలీసులను ఆశ్రయించడంతో వాళ్లు ఆ లేడీ కిలాడీని పట్టుకోడానికి రంగంలోకి దిగారు. ఇట్టే ఆకట్టుకునేలా మాట్లాడుతూ... కుర్రాళ్ల వ‌ద్ద‌కు వ‌చ్చి వారి వ‌ద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లను తీసుకుని పారిపోతున్న ఈ లేడీ కిలాడీ గురించి ఫిర్యాదు అందుకున్న ఢిల్లీ పోలీసులు ఆమెను ప‌ట్టుకోవ‌డానికి నాలుగు టీమ్‌ల‌ను నియ‌మించారు. అయిన‌ప్ప‌టికీ ఇంకా ఆ గజదొంగ ఆచూకీ మాత్రం దొరకలేదు. గత మూడు రోజుల్లోనే నలుగురు కుర్రాళ్లు ఆమె చేతివాటం బారిన పడి లబోదిబోమంటున్నారు. 
 
ఖ‌రీదైన‌ కారులో వస్తోన్న యువ‌తి రోడ్డుప‌క్క‌న ఉన్న యువ‌కులే ల‌క్ష్యంగా త‌న గార‌డి మొద‌లుపెడుతుంద‌ని పోలీసులు తెలిపారు. కారులో వ‌చ్చి యువ‌కుల‌ను అడ్ర‌స్ అడుగుతున్నట్టు అడిగి మాట్లాడుతుందని చెప్పారు. తన ఫోన్ బ్యాటరీ అయిపోయిందని ఒక్క కాల్ చేసుకుంటానని చెప్పి యువ‌కుల వ‌ద్ద నుంచి ఫోన్లు తీసుకుంటుందని పేర్కొన్నారు. అనంత‌రం ఆమె సిద్ధంగా ఉంచుకున్న‌ కారులో పారిపోతోంద‌ని చెప్పారు. 
 
తాజాగా ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లో ఆమె తన చేతివాటం చూపించింది. ఆమె నిజంగానే ఏదో ఇబ్బందిలో ఉందనుకున్నానని, ఆమె చాలా చదువుకున్న దానిలాగే కనిపించిందని, అత్యవసరంగా తనవాళ్లకు ఫోన్ చేసుకోవాలని చెబితే తన ట్యాబ్ ఇచ్చానని.. తీరా ఆమె కాస్తా అది తీసుకుని వెళ్లిపోయిందని చేతన అనే విద్యార్థిని తెలిపింది. 
 
టాబ్ ఆమెకు ఇచ్చిన తర్వాత దగ్గరగా కూడా వెళ్లకుండా.. ఆమెను గౌరవించాలని కొంతదూరంలోనే నిలబడ్డానని, ఆమె కాల్ చేస్తున్నట్లు నటించి, అంతలోనే ఎక్స్‌లేటర్ తొక్కి.. పారిపోయిందని, తాను ఆమెను వెంబడించేందుకు ప్రయత్నించినా దొరకలేదని చేతన వాపోయింది. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదుచేయగా.. మరికొద్ది నిమిషాల్లోనే అలాంటిదే మరో ఫిర్యాదు వచ్చింది. అక్కడ మొబైల్ ఫోన్ పోయింది. కోచింగ్ సెంటర్లకు కేంద్రమైన ముఖర్జీ నగర్‌లో విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుని ఈ యువతి దొంగతనాలకు పాల్పడుతోందని అధికారులు అంటున్నారు.