సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 జులై 2021 (13:47 IST)

బావి మాయమైంది.. వెతికిపెట్టండి.. కర్ణాటకలో వింత ఘటన

ఏదో సినిమాలో పొలంలో చేపల చెరువును ఎవరో దొంగలించారని పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. ఎలాగైనా పోలీసులు త‌న చేప‌ల చెరువును వెతికి ప‌ట్టుకోవాల‌ని పోలీసుల‌తో పాటు అధికారుల‌ను ముప్పుతిప్ప‌లు పెడ‌తాడు. అచ్చంగా అలాంటి ఘ‌ట‌న‌నే క‌ర్ణాట‌క రాష్ట్రంలో జ‌రిగింది. అయితే.. ఇక్క‌డ పోయింది చేప‌ల చెరువు కాదండి.. ఓ బావి.
 
వివ‌రాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం బెళగావి జిల్లాలోని భేండవాడ గ్రామ పంచాయతీ పరిధి మావినహొండ గ్రామంలో మ‌ల్ల‌ప్ప అనే రైతు త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. కాగా.. మంగ‌ళ‌వారం అత‌డు తన పొలంలోని బావి కనిపించడం లేదని, ఎలాగైనా దానిని వెతికి పెట్టాలని రాయబాగ్‌ పోలీసు స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తొలుత రైతు ఇచ్చిన ఫిర్యాదు చూసి పోలీసులు షాక్‌కు గుర‌య్యారు. తీరా అస‌లు నిజం తెలుసుకుని ద‌ర్యాప్తు చేపట్టారు. 
 
అసలు నిజం ఏమిటంటే.. మల్లప్ప పొలంలో బావిని తవ్వినట్టు పంచాయతీ అధికారులు రికార్డులు సృష్టించి, ప్రభుత్వ నిధులు కాజేశారు. అంతేకాక, బావి తవ్వించినందుకు తీసుకున్న రుణం తిరిగి చెల్లించాలంటూ రైతుకు నోటీసులు కూడా పంపారు. దీంతో విస్తుపోయిన రైతు పోలీసులను ఆశ్రయించడంతో అధికారుల బాగోతం బయటపడింది. ప్ర‌స్తుతం దీని పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.