గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 సెప్టెంబరు 2021 (11:22 IST)

ఉపాధ్యాయులు జీన్స్, టీ షర్టులు ధరించకూడదు.. ఎక్కడ?

ఉపాధ్యాయులు జీన్స్, టీ షర్టులు ధరించకూడదు. ఇక మహిళా టీచర్లంటారా.. జీన్స్ లేదా శరీరానికి అతుక్కుపోయేలా ఉండే దుస్తులు అసలే వేసుకోవద్దు. నీట్‌గా గడ్డం చేసుకోవాలి. కటింగ్‌ మచింగా ఉండాలి. గోర్లు కట్‌ చేసుకోవడంతోపాటు పర్ఫ్యూమ్‌ వేసుకునే స్కూలు లేదా కాలేజీకి రావాలి. ఇవన్నీ తప్పనిసరిగా చేయాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. ఇదంతా ఎక్కడనుకుంటున్నారు.. మన పొరుగుదేశం పాకిస్థాన్‌లో..
 
మహిళా ఉపాధ్యాయులు టీన్స్‌, బిగుతుగా ఉండే దుస్తులు వేసుకోకూడదని పాకిస్థాన్‌ ఫెడరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (FDE) ఆదేశాలు జారీచేసింది. ఇది పురుష ఉపాధ్యాయులకు కూడా వర్తిస్తుందని, జీన్స్‌, టీ షర్టులు ధరించకూడదని స్పష్టం చేసింది. టీచింగ్‌ ప్రొఫెషన్‌లో ఉన్న పురుషులు ప్యాంట్, షర్టులు ధరించాలని, మహిళా టీచర్లు షల్వార్ కమీజ్ ధరించాలని నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించి స్కూళ్లు, కాలేజీల ప్రిన్సిపల్స్‌కు విద్యాశాఖ డైరెక్టర్ ఒక లేఖ పంపించారు.
 
ఉపాధ్యాయులు రెగ్యులర్ హెయిర్‌కట్ చేయడం, గడ్డం ట్రిమ్ చేయడం, నెయిల్ కటింగ్, స్నానం, డియోడరెంట్ లేదా పెర్ఫ్యూమ్ ఉపయోగించడం వంటివి పాటించాలని సూచించింది. అదేవిధంగా క్లాస్‌రూమ్‌, ల్యాబ్‌లో ఉన్నప్పుడు టీచింగ్ సిబ్బంది అందరూ టీచింగ్ గౌన్లు ధరించాలని పేర్కొన్నారు. గేట్‌కీపర్లు, సహాయక సిబ్బంది తప్పనిసరిగా యూనిఫామ్‌ ధరించాలని నిర్దేశించింది.
 
మహిళా ఉపాధ్యాయులు హుందాగా కనిపించేలా షల్వార్‌ కమీజ్‌, ట్రౌజర్లు, స్కార్ఫ్ లేదా హిజాబ్‌తో షర్ట్‌ వేసుకోవచ్చని అందులో పేర్కొన్నది. ఇక పురుష టీచర్లు ప్యాంటు, టైతో షర్టు ధరించడం తప్పనిసరని పేర్కొంది.