శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 జులై 2021 (16:44 IST)

పెగాసస్‌ స్పైవేర్‌ సెగ.. రాహుల్ గాంధీ ఫోన్ ట్యాప్.. రాజద్రోహం అంటూ ఫైర్

దేశంలో ప్రకంపనలు సృష్టించిన పెగాసస్‌ వ్యవహారంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా నరేంద్ర మోడీ, అమిత్‌షా, దేశీయ వ్యక్తులు, సంస్థలపై పెగాసస్‌ స్పైవేర్‌తో నిఘా పెట్టారని విమర్శించారు. పెగాసస్‌ వ్యవహారంపై కేంద్రం సమాధానం చెప్పాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపించాలని డిమాండ్‌ చేశారు. 
 
"నా ఫోన్‌ నంబర్‌ లక్షిత జాబితాలో ఉండటం కాదు.. నా మొబైల్‌ను కూడా ట్యాప్‌ చేశారు. ఇది కేవలం రాహుల్‌ గాంధీ ప్రైవసీకి సంబంధించిన విషయం కాదు. దేశ ప్రజల గొంతుకపై చేసిన దాడి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది రాజద్రోహం.."అని కాంగ్రెస్‌ అగ్ర నాయకులు రాహుల్‌ గాందీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. 
 
పెగాసస్‌ను ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఆయుధంగా వర్గీకరించిందని, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా దీన్ని ఉపయోగిస్తారని తెలిపిందని పేర్కొన్నారు. మోడీ, అమిత్‌షా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఆయుధాన్ని దేశంలోని అన్ని సంస్థలపై ప్రయోగించారని ఆరోపించారు. సిబిఐ డైరెక్టర్‌ ఫోన్‌పైనా నిఘా పెట్టారని, సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా వినియోగించారని తెలిపారు. కర్ణాటకలో ప్రభుత్వం కూల్చివేతకు పెగాసస్‌ ఉపయోగించారని విమర్శించారు.
 
పంజాబ్‌ కాంగ్రెస్‌లో నెలకొన్న విభేదాలపైనా రాహుల్‌ గాంధీ స్పందించారు. ప్రస్తుతం సమస్య సద్దుమణిగిందని తెలిపారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, పంజాబ్‌ పిసిసి చీఫ్‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధూ శుక్రవారం ముఖాముఖీగా కలుసుకున్న కొద్ది సేపటికే రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.