శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2016 (13:14 IST)

2007లో అత్తమ్మను కలిశా.. ఇంటర్‌కామ్‌లో మాట్లాడాను.. శశికళే ఆ పని చేసింది: దీప

తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతిపట్ల ఆమె అన్న కుమార్తె దీప సోమవారం ఓ తమిళ టీవీ ఛానల్‌తో మాట్లాడారు. జయలలిత తమ కుటుంబాన్ని పక్కనబెట్టలేదని స్పష్టం చేశారు. జయమ్మ బెంగళూరులో ఉన్న తన సోదరుడు జయకుమార్‌తో స

తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతిపట్ల ఆమె అన్న కుమార్తె దీప సోమవారం ఓ తమిళ టీవీ ఛానల్‌తో మాట్లాడారు. జయలలిత తమ కుటుంబాన్ని పక్కనబెట్టలేదని స్పష్టం చేశారు. జయమ్మ బెంగళూరులో ఉన్న తన సోదరుడు జయకుమార్‌తో సంబంధాలను తెగతెంపులు చేసుకున్నారని, ఆయన్ని పక్కనబెట్టారని వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని దీప వెల్లడించారు. అత్తకు-తన తండ్రికి మాటల్లేవు అనడం అసత్యమని చెప్పారు. 
 
తాను తన తండ్రితో పాటు పోయెస్ గార్డెన్‌కు వెళ్తామని, ఆమెతో మాట్లాడి వస్తామని దీప చెప్పారు. తమ కుటుంబాన్ని ఆమె కంటికి రెప్పలా చూసుకున్నారని వెల్లడించారు. జయలలిత తనను (దీప) దత్తత తీసుకోవాలని తన తండ్రి ఆకాంక్షించారు. అయితే అత్తమ్మ సుధాకర్‌ను దత్తత తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఆయన పెళ్ళిని జయలలిత ఘనంగా నిర్వహించారని తెలియవచ్చింది. ఇదంతా తండ్రి జయకుమార్‌కు ఎంతో ఆవేదనను మిగిల్చిందని దీప చెప్పుకొచ్చారు. 
 
ఇదే ఆయన మరణానికి కారణమైందని, చివరిగా 2007లో అమ్మను కలిశానని.. ఆపై పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళిపోవాల్సి వచ్చిందని దీప వెల్లడించారు. 
 
విదేశాల నుంచి తిరిగొచ్చాక అమ్మను కలిసేందుకు వెళ్లాను. పోయెస్ గార్డెన్‌కు వెళ్ళిన తనతో అత్తమ్మ ఇంటర్‌కామ్ ద్వారానే మాట్లాడారని, తనకు పనెక్కువ ఉందని.. ఇప్పట్లో కలిసే వీలు లేదని చెప్పినట్లు దీప వెల్లడించారు. ఆపై శశికళ అత్తను కలవనివ్వలేదు. తన గురించి అత్తతో అపవాదులు చెప్పి.. ఆమెను పూర్తిగా మార్చేశారని దీప చెప్పుకొచ్చారు. పనిలో పనిగా శశికళపై దీపా జయకుమార్ మండిపడ్డారు. 
 
అత్తమ్మ అపోలో ఉన్నప్పుడు శశికళ ఆమెను చూసేందుకు కూడా అనుమతించలేదని చెప్పారు. జయత్త మరణంపై అనుమానాలు లేకపోయినా.. అపోలో చేర్పించినప్పటి నుంచి చివరి రోజు వరకు జరిగిన విషయాలు, చికిత్సకు సంబంధించిన విషయాల గురించి తనకు తెలియాలన్నారు. జయలలిత ఆరోగ్యం.. అపోలోలో ఆమెకు అందించిన చికిత్సపై నోరెత్తని శశికళ అన్నాడీఎంకే పార్టీకి అధినేత్రి ఎలా అవుతారని దీప ప్రశ్నించారు. 
 
అమ్మ అపోలోలో ఉన్న ఫోటోలు, ఆమె చికిత్సా వివరాలను ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్న తరుణంలో.. వాటి వివరాలను పారదర్శకంగా బయటపెట్టలేని శశికళ పార్టీ బాధ్యతలను సమర్థవంతంగా ఎలా నిర్వహిస్తారని దీప ప్రశ్నల వర్షం కురిపించారు.