సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 7 ఫిబ్రవరి 2019 (14:37 IST)

కర్ణాటక గవర్నర్‌కు చుక్కలు చూపిన బీజేపీ.. కాంగ్రెస్‌కు షాకిస్తున్న ఎమ్మెల్యేలు

కర్ణాటక రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. రాష్ట్ర గవర్నర్ వాజుభాయ్ వాలాకు బీజేపీ ఎమ్మెల్యేలు చుక్కలు చూపించారు. ఈ గవర్నర్ బీజేపీ కొమ్ముకాస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. అలాంటి గవర్నర్ పట్ల బీజేపీ శాసనసభ్యులు ప్రవర్తించిన తీరు ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
కర్ణాటక శాసనసభ సమావేశాల్లో భాగంగా, గవర్నర్‌ ప్రసంగాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. శాసనసభ ఉభయసభలను ఉద్దేశించి తాను బుధవారం ప్రసంగిస్తున్న సమయంలో బీజేపీ సభ్యులు ఒక్కసారిగా పోడియంలోకి దూసుకొచ్చి 'గవర్నర్‌ గో బ్యాక్' అంటూ నినాదాలు చేశారు. దీంతో గవర్నర్ ఒక్కసారిగా విస్తుపోయారు. 
 
అయితే కొద్దిసేపు సాంకేతికంగా బీజేపీ సభ్యులు ధర్నా చేస్తారని భావించినా ఆ పార్టీ సభ్యులంతా బిగ్గరగా నినాదాలు చేయడంతో గవర్నర్‌ ప్రసంగం ఎవరికీ వినిపించలేదు. చేసేది లేక 22 పేజీల ప్రసంగ పాఠంలోని రెండు పేరాలను మాత్రం మొక్కుబడిగా చదివి కేవలం 2 నిమిషాలలో గవర్నర్‌ తన ప్రసంగ పాఠాన్ని ముగించి వెళ్లిపోయారు. 
 
మరోవైపు బడ్జెట్ సమావేశాలకు విధిగా హాజరుకావాలంటూ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. కానీ, ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సమావేశాలు డుమ్మాకొట్టారు. దీంతో బీజేపీ నేతలు మళ్లీ ఆపరేషన్ కమలకు తెరలేపారా? అనే సందేహం కలుగుతోంది. మొత్తంమీద బీజేపీ ఎమ్మెల్యేల తీరుతో పాటు.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల వైఖరితో ముఖ్యమంత్రి కుమారస్వామి మాత్రం ప్రశాంతంగా ఉండలేక పోతున్నారు.