మంగళవారం, 22 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 19 మే 2016 (14:24 IST)

కేరళలో ఖాతా తెరిచిన బీజేపీ :: ఓటమి వూహించలేదు: ఉమెన్‌ చాందీ

కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన ఖాతాను తెరిచింది. గురువారం వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా ఓ నియోజకవర్గంలో విజయం సాధించింది. నెమోమ్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఓ.రాజగోపాల్‌ గెలుపొందారు. అంతేగాక.. ఈ ఏడాది ఎన్నికల్లో భాజపాకు ఓట్ల శాతం కూడా పెరిగింది. 2011లో భాజపాకు 6.15శాతం ఓట్లు రాగా.. ఈ ఎన్నికల్లో ఇప్పటివరకు వెలువడిన ఫలితాల మేరకు అది 11.1 శాతానికి పెరిగింది. మరికొన్ని నియోజకవర్గాల్లోనూ భాజపా రెండోస్థానంలో కొనసాగుతోంది. 
 
మరోవైపు.. కేరళలో యూడీఎఫ్‌ కూటమి ఓటమిని ఊహించలేదని, ఇది తమకు ఎదరుదెబ్బ అని కేరళ ముఖ్యమంత్రి ఉమెన్‌ చాందీ అన్నారు. కేరళలో సీపీఎం ఆధ్వర్యంలోని ఎల్‌డీఎఫ్‌ కూటమి విజయభేరీ మోగించిన విషయం తెల్సిందే. ఈ ఫలితాలు వెల్లడైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇది వూహించని ఓటమి అన్నారు. అయితే ప్రజల తీర్పును యూడీఎఫ్‌ అంగీకరిస్తోందన్నారు.
 
ఫలితాలను పరిశీలిస్తామని.. అన్ని కోణాల్లో ఓటమికి గల కారణాలపై విశ్లేషించి తగిన చర్యలు తీసుకుంటామని చాందీ వెల్లడించారు. విజయం విజయమే.. ఓటమి ఓటమే.. ప్రజాస్వామ్యంలో వీటిని నిర్వచించలేమన్నారు. యూడీఎఫ్‌ ఛైర్మన్‌గా ఓటమికి తాను బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించారు. ఎల్‌డీఎఫ్‌ కూటమి నుంచి సీపీఎం నేత అచ్యుతానందన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన మరోమారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.