సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 8 ఆగస్టు 2018 (11:40 IST)

అన్న పక్కనే తమ్ముడు : పెద్దపెట్టున విలపించిన స్టాలిన్ - అళగిరి

చెన్నై మెరీనా తీరంలో డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియలు జరుగనున్నాయి. ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు తమకు ఎటువంటి అభ్యంతరమూ లేదని మద్రాసు హైకోర్టు స్పష్టంది.

చెన్నై మెరీనా తీరంలో డీఎంకే అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియలు జరుగనున్నాయి. ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు తమకు ఎటువంటి అభ్యంతరమూ లేదని మద్రాసు హైకోర్టు స్పష్టంది. ఈ తీర్పు వెలువడిన వెంటనే రాజాజీ హాల్ వద్ద ఉంచిన తన తండ్రి భౌతికాయం పక్కనే నిలబడివున్న కరుణానిధి కుటుంబ సభ్యుడుల తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
 
కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందన్న విషయం తెలిసిన వెంటనే, మైకుల ద్వారా అనౌన్స్ చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న స్టాలిన్, అళగిరి, కనిమొళి తదితరులు పెద్దపెట్టున విలపించారు. తండ్రి భౌతికకాయాన్ని ఉంచిన శవపేటికను పట్టుకుని కన్నీరు పెట్టుకున్నారు. అక్కడే వేలాదిగా ఉన్న కార్యకర్తలు ఒక్కసారిగా ముందుకు దూసుకు వచ్చి, కలైంజ్ఞర్ వాళ్గే అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. 
 
అంతకుముందు మెరీనా స్థలం కోరుతూ డీఎంకే తరపున దాఖలైన పిటీషన్‌పై మద్రాస్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని బెంచ్ వాదనలు ఆలకించింది. కరుణానిధి అంత్యక్రియలపై దాఖలైన ఓ రిట్ పిటిషన్‌పై ఇంత అత్యవసరంగా వాదనలు వినాల్సిన అవసరం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది వ్యాఖ్యానించారు. దీనికి ఓ న్యాయమూర్తి వారం రోజుల వాటు వాయిదా వేద్దామా అంటూ వెటకారంగా అన్నారు. అంతేనా, జయలలిత అంత్యక్రియలను మెరీనా బీచ్‌లో నిర్వహించేందుకు ఏ కోర్టు అనుమతి తీసుకున్నారంటూ నిలదీశారు. 
 
ఆ తర్వాత ప్రభుత్వ వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. ఇరువురి వాదనలు విన్న మద్రాస్ హైకోర్టు మెరీనా-అన్నా స్కేర్ వద్దే కరుణానిధి అంత్యక్రియలకు అనుమతినిచ్చింది. సాయంత్రం మెరీనాలో కరుణానిధి అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కోర్టు తీర్పుతో కరుణానిధి కుటుంబ సభ్యులు, డీఎంకే శ్రేణులు భావోద్వేగానికి గురయ్యారు. డీఎంకే నేతలు ఆనందం వ్యక్తం చేశారు. సంతోషంతో కన్నీటిపర్యంతమయ్యారు.