పెళ్లి డబ్బుతో 108 ఇళ్లు నిర్మించి ఇచ్చిన కొత్త వధువు... గాలిని చూసి బుద్ధి తెచ్చుకో...
పెద్ద నోట్ల రద్దుతో పెళ్ళిళ్ళలో సందడి కరువైంది. విందు భోజనాలతో జరగాల్సిన పెళ్ళిళ్లు.. టీ విందుతో సరిపెట్టుకుంటున్నాయి. తాజాగా తన పెళ్లిని సాధారణంగా చేసుకొని, పెళ్లికి అయ్యే ఖర్చుతో...108 మంది నిరుపేదల
పెద్ద నోట్ల రద్దుతో పెళ్ళిళ్ళలో సందడి కరువైంది. విందు భోజనాలతో జరగాల్సిన పెళ్ళిళ్లు.. టీ విందుతో సరిపెట్టుకుంటున్నాయి. తాజాగా తన పెళ్లిని సాధారణంగా చేసుకొని, పెళ్లికి అయ్యే ఖర్చుతో...108 మంది నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కట్టించ్చింది ఓ నూతన వధువు. తద్వారా నేటితరం యువతకు ఆదర్శంగా నిలిచింది. మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి కూతురి పెళ్లికి.. అట్టహాసానికి కోట్లు ఖర్చు పెట్టిన గాలి జనార్థన్ రెడ్డి ఈ కొత్త వధువులా ఆలోచించి వుంటే కనీసం ఓ 5000 ఇళ్లను నిర్మించి పేదలకు ఇచ్చివుండొచ్చునని విశ్లేషకులు అంటున్నారు.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన శ్రేయ మునోద్‌ది బాగా డబ్బున్న కుటుంబం. ఆమె అత్తింటి వాళ్లు కూడా శ్రీమంతులే. ఇక అట్టహాసంగా తన పెళ్ళి జరగాలనే పెద్దల కోరికను పక్కనబెట్టింది. అంతేగాకుండా తన పెళ్ళిని తరతరాలు గుర్తుండిపోయేలా చేసుకోవాలని ఆలోచించిన శ్రేయ.. తన పెళ్ళికి ఖర్చు చేయాల్సిన డబ్బుతో 108 ఇళ్లను ప్రారంభించింది. అందులో ఆమె పెళ్లినాటికి 90 ఇళ్లు పూర్తి స్థాయిలో నిర్మించబడ్డాయి.
గుర్తించిన నిరుపేదలను.. తన పెళ్లికి ప్రత్యేక అతిథులుగా పిలిచి, కొత్త ఇంటి తాళాలను వారి చేతికందించింది శ్రేయ. మిగిలిన 18 ఇళ్లను కూడా త్వరలోనే పూర్తి చేసి, వాటిని కూడా నిరుపేదలకు ఇచ్చే ఆలోచనలో ఆ కొత్త వధువు వుంది. కోట్లు వెచ్చించి పెళ్ళి అట్టహాసంగా చేసుకోవాలనుకునే ఈ రోజుల్లో.. పేదలకు ఇళ్లను నిర్మించి ఇచ్చిన శ్రేయపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈమె నిర్ణయాన్ని భర్తతో సహా... అత్తింటి వారు కూడా స్వాగతించారు. ఇళ్ళను కానుగా పొందిన వారు.. నూతన వధూవరులను తమ కొత్త ఇండ్లలోకి ఆహ్వానించి సన్మానించారు.