శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 28 జూన్ 2017 (06:22 IST)

సోషల్ మీడియా రైటర్స్‌ని అరెస్టుచేస్తే.. ఇక దిమ్మ తిరుగుతుంది.. ప్రభుత్వాలను చాచి కొట్టిన సుప్రీంకోర్టు

తమకు అనుకూలమైన రాతలను చూసి ఆనందిస్తూ, వ్యతిరేకమైన రాతలను అణచివేస్తూ అరెస్టుల పర్వాన్ని సాగిస్తున్న ప్రభుత్వాలకు చెంపపెట్టు తగిలింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ - 2000 చట్టంలోని సెక్షన్-66Aను కొట్టేస్తూ మంగళవారం (జూన్ 27) సుప్రీంకోర్టు సంచలన తీర్పు

తమకు అనుకూలమైన రాతలను చూసి ఆనందిస్తూ, వ్యతిరేకమైన రాతలను అణచివేస్తూ అరెస్టుల పర్వాన్ని సాగిస్తున్న  ప్రభుత్వాలకు చెంపపెట్టు తగిలింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ - 2000 చట్టంలోని సెక్షన్-66Aను కొట్టేస్తూ మంగళవారం (జూన్ 27) సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐటీ యాక్ట్ - 2000లోని సెక్షన్-66A అనేది ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా ఉందని.. జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు సందర్భంగా పేర్కొంది. పౌరుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించేవిధంగా ఉన్నందువల్ల ఈ సెక్షన్ చట్టసమ్మతం కాదని ధర్మాసనం తెలిపింది. 
 
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి అరెస్టుల విషయంలో పోలీసులు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ‘సెక్షన్-66A ద్వారా పౌరుల ఆలోచనా, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై నేరుగా ప్రభావం పడుతోంది. ఒక వ్యక్తికి అభ్యంతరకరమైంది మరో వ్యక్తికి అభ్యంతరకరం కాకపోవచ్చు. మన రాజ్యాంగం.. పౌరులకు స్వేచ్ఛ, ఆలోచనలను వ్యక్తీకరించే హక్కును ప్రసాదించింది. వీటికి భంగం వాటిల్లేవిధంగా ఎలాంటి నిబంధనలను అంగీకరించేది లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఈ సెక్షన్‌ను పూర్తిగా కొట్టేస్తున్నట్లు తెలిపింది.
 
సోషల్ మీడియాలో పోస్టింగులకు సంబంధించి ఐటీ యాక్ట్- 2000లోని సెక్షన్-66Aపై గత కొన్నేళ్లుగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా పలువురు నెటిజన్లు సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఉత్తర ప్రదేశ్, పశ్చిమబెంగాల్,  మహారాష్ట్ర, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాలు గత నాలుగేళ్ల కాలంలో రాజకీయ నేతలపై అభ్యంతరకర రీతిలో పోస్టులు పెట్టారంటూ నెటిజన్లను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
 
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్టింగులకు సంబంధించి ఒక సమగ్ర నిబంధనలను తీసుకొచ్చే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. పౌరులకు తమ భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉండాలని, అదే సమయంలో అది మరొకరి పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేవిధంగా ఉండకూడదని ప్రభుత్వం వాదిస్తోంది.
 
ఏదైమైనా ప్రభుత్వ అసమర్థతను, క్రియా రాహిత్యాన్ని, రాజకీయ నేతల అవినీతి విశ్వరూపాన్ని ఎండగడుతున్న నెటిజన్లపై చేయి వేయాలంటే ఇక ప్రభుత్వాలు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిందే.