ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 మార్చి 2017 (11:35 IST)

నా గురించి పట్టించుకోకుండా.. మీ పదవులు చక్కబెట్టుకుంటున్నారా?: మంత్రుల్ని ప్రశ్నించిన చిన్నమ్మ

దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితురాలిగా అరెస్టయి.. బెంగళూరులోని పరప్పన జైలులో ఊచలు లెక్కిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ.. తనను కలిసేందుకు బెంగళూరు జైలుకు వెళ్లిన ముగ

దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితురాలిగా అరెస్టయి.. బెంగళూరులోని పరప్పన జైలులో ఊచలు లెక్కిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ.. తనను కలిసేందుకు బెంగళూరు జైలుకు వెళ్లిన ముగ్గురు మంత్రులపై ఫైర్ అయ్యారు. ఇటు అక్రమార్జన కేసులో అప్పీలుకు వెళ్లకుండా అలసత్వం, అటు పార్టీ పదవిపై ఎన్నికల సంఘం నోటీసుకు సంజాయిషీ ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని చిన్నమ్మ మంత్రులపై మండిపడ్డారు. 
 
అధికారంలో ఉన్నామనే మాటే కానీ జైలు నుంచి పార్టీ పదవీ గండం నుంచి తనను గట్టెక్కించాలనే ధ్యాస లేదని మంత్రులపై విరుచుకుపడింది. తనను ఇలా జైలులో కూర్చోబెట్టి.. తమ పదవులను చక్కబెట్టుకునే పనిలో బిజీ అయిపోయారు కదూ అంటూ శశికళ ఫైర్ కావడంతో మంత్రులు సెంగొట్టయన్, కామరాజ్‌, దిండుగల్‌ శ్రీనివాసన్ నోరెళ్లబెట్టారు. 
 
ఇదిలా ఉంటే.. పార్టీ నియమ నిబంధనలకు లోబడే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా తన నియామకం జరిగిందని ప్రధాన ఎన్నికల సంఘాని(ఈసీ)కి శశికళ లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిని పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ ద్వారా ఆమె ఈసీకి అందజేశారు. పార్టీలో ఐదేళ్లపాటు నిరంతర సభ్యత్వం లేకుండా ఎన్నికైనందున, శశికళ ఎంపిక చెల్లదని ప్రకటించాలని కోరుతూ ఈసీకి ఫిర్యాదు అందింది. దీంతో శశికళకు ఈసీ నోటీసు ఇచ్చింది. ఈనేపథ్యంలో దినకరన్  ద్వారా శశికళ ఈసీకి వివరణ ఇచ్చారు. 
 
మరోవైపు, జయలలిత మరణంపై పలు అనుమానాలున్నందున సీబీఐ విచారణకు ఆదేశించాలని రాష్ట్ర మాజీ సీఎం పన్నీర్‌సెల్వం మద్దతుదారులైన 12 మంది ఎంపీలు రాష్ట్రపతి ప్రణబ్‌కి వినతిపత్రం సమర్పించారు. కాగా శశికళ గదిలో టీవీ మినహా ఆమెకు ఎలాంటి వసతులు కల్పించలేదని కర్ణాటక జైలు శాఖాధికారి తెలిపారు. ఏసీ వసతులు ఆమెకు కల్పించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.