శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , ఆదివారం, 5 మార్చి 2017 (06:40 IST)

మాది గాయత్రి మంత్రం.. వాళ్లది ప్రజాపతి గాయత్రి మంత్రం : మోదీ దాడి

వారణాసి మోదీ నివాసమయింది. ఏడు దశల ఉత్తరప్రదేశ్ ఎన్నికల కేంపెయిన్ చివరిదశలో సుడిగాలిలా వారణాసిలో పర్యటించిన మోదీ 2014 లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని తలపింపచేశారు. వారణాసి వీధులు ‘నమో’ మంత్రంతో శనివారం పిక్కటిల్లాయి. రహదారులు కదులుతున్నాయా అన్నట్టు పవిత్ర

వారణాసి మోదీ నివాసమయింది. ఏడు దశల ఉత్తరప్రదేశ్ ఎన్నికల కేంపెయిన్ చివరిదశలో సుడిగాలిలా వారణాసిలో పర్యటించిన మోదీ 2014 లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని తలపింపచేశారు. వారణాసి వీధులు ‘నమో’ మంత్రంతో శనివారం పిక్కటిల్లాయి. రహదారులు కదులుతున్నాయా అన్నట్టు పవిత్ర కాశీ నగరం కదలబారింది. కాశీనాథుని దర్శనం కోసం నిత్యం కిటకిటలాడుతుండే దారులు కాషాయవర్ణంలోకి మారాయి. యూపీ ప్రచార ప్రధాన సారథ్యాన్ని చేపట్టి, ఆరు దశలను దాటొచ్చిన మోదీ... ఇప్పుడిక ‘అంతిమ’ పోరుకు సిద్ధమయినట్టు కనిపిస్తోంది. భద్రతావలయాన్ని సైతం దాటుకొనివెళ్లి, కాశీనాథుడు, కాలభైరవ ఆలయాల్లో పూజలు చేయడం, ఏకంగా మూడురోజులు నగరంలో ఉండాలని నిర్ణయించుకోవడం గతంలో ఎన్నడూ కనిపించని దృశ్యాలు.
చివరి దశ పోలింగ్‌ జరిగే నియోజకవర్గాల్లో ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి పరిధిలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం తొలిరోజు ప్రచారంలో భాగంగా.. బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం ద్వారం వద్ద నుంచి కాలభైరవుడి ఆలయం దాకా రోడ్‌షో సాగింది. ‘సుభాహ్‌ బెనారస్‌.. షామ్‌ బెనారస్‌.. మోదీ తేరే నామ్‌ బెనారస్‌’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. భారతరత్న మదన్‌మోహన్‌ మాలవియాకు ప్రణమిల్లి... ఇరుకు సందుల్లోని ఆలయాల్లో పూజలు చేస్తూ..సాగిన మోదీ రోడ్‌షో ఆసాంతం బలప్రదర్శనను తలపించింది.
 
ఎస్పీ, కాంగ్రెస్‌ నేతలపై మోదీ ఈ సందర్భంగా విరుచుకుపడ్డారు. ‘‘ఏదైనా మంచిపని తలపెట్టినప్పుడు మనం గాయత్రి మంత్రం పఠిస్తాం. కానీ, ఎస్పీ, కాంగ్రెస్‌ నేతలు మాత్రం ‘గాయత్రి ప్రజాపతి మంత్రం పఠిస్తున్నారు’’ అని ఎద్దేవా చేశారు. ‘‘ఓ ఆడబిడ్డ ఆర్తనాదాలు వినిపించనంత గాఢనిద్రలో అఖిలేశ్‌ ఉన్నారు. ఇలాంటి వినాశకారులకు అంతిమ సంస్కారాలు జరిపించే అవకాశం ప్రజలకు వచ్చింది’’ అని మోదీ అన్నారు. ‘కుచ్‌కా సాత.. కుచ్‌కా వికాస్‌’ (కొందరితోనే స్నేహం.. కొందరికే వికాసం) అన్నట్టు అఖిలేశ్‌ పాలన సాగుతున్నదని ధ్వజమెత్తారు. 
 
ప్రధాన రాజకీయ పక్షాల అధినేతలంతా ఒకేరోజు వారణాసిలో కాలుపెట్టడంతో అడుగడుగునా ఉద్విగ్న వాతావరణం కనిపించింది. ప్రధాని మోదీ రోడ్‌షో సందర్భంగా ఏర్పాటుచేసిన పోస్టర్లను పోలీసులు తొలగించడంపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎన్నికలకోడ్‌లో భాగంగా, ఈసీ ఆదేశాల మేరకు తాము నడుచుకొన్నామని అధికారులు చెప్పినా వారు వినిపించుకోలేదు. కాగా, కాశీనాథుడి ఆలయం ఎదుట ఓ మసీదుకు ఆనుకొని అఖిలేశ్‌ యాదవ్‌, రాహుల్‌గాంధీల నిలువెత్తు పోస్టరు కనిపించగానే.. బీజేపీ కార్యకర్తల ఆగ్రహం కట్టలుతెంచుకొంది. ప్రార్థనామందిరాల వద్ద రాజకీయ ప్రచారం, ప్రదర్శనలు, పోస్టర్లు వేయడం ఎన్నికల కోడ్‌కు విరుద్ధమంటూ పోలీసులతో వారు వాదించారు. అనుమతి లేకుండా వారణాసిలో రోడ్‌షో జరిపిన మోదీపై ఈసీ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.