రాహుల్ గాంధీని ముక్కలు ముక్కలుగా చేస్తాం: బెదిరింపు లేఖ
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి బెదిరింపులు వచ్చాయి. రాహుల్ గాంధీని నరికేస్తామని పుదుచ్చేరిలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి వీ నారాయణస్వామి నివాసానికి బెదిరింపులు లేఖలు వచ్చాయి. మంగళవారం పుదుచ్చేరిలో భాగమైన కారైకల్‌లో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారం పాల్గొననున్న రాహుల్‌ను చంపేస్తామంటూ ఆగంతకులు ఆ లేఖలో వార్నింగ్ ఇచ్చారు.
అయితే ఆ లేఖలో ఎవరి సంతకమూ లేదు. కాంగ్రెస్ పార్టీ విధానాల ద్వారా కార్మికులు ఇబ్బంది పడుతున్నారని.. పుదుచ్చేరిలో చాలా పరిశ్రమలు మూతపడ్డాయని ఆ లేఖలో పేర్కొన్నారు. అందుకే దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీని ముక్కలు ముక్కలు చేస్తామని లేఖలో ఆగంతకులు వార్నింగ్ ఇచ్చారు.
ఈ లేఖపై నారాయణస్వామి, ఇతర కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ ప్రారంభమైంది. ఈ లేఖను పుదుచ్చేరి నుంచే పోస్ట్ చేసినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో రాహుల్ గాంధీకి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసేందుకు పుదుచ్చేరి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇంకా రాహుల్ గాంధీకి ప్రత్యేక భద్రత కావాల్సిందిగా కేంద్ర మాజీ మంత్రి నారాయణ స్వామి కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ను విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.