సముద్ర తీరం వెంబడి రక్షణ తస్మాత్ జాగ్రత్త : కేంద్ర హోం మంత్రి
న్యూఢిల్లీ: మన దేశ సమగ్రత కోసం సముద్ర తీర ప్రాంతాల్లో గస్తీ, రక్షణ చర్యలు అత్యవసరమని కేంద్ర హోం మంత్రి స్పష్టం చేశారు. తీర ప్రాంత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎస్ లు, డీజీపీలతో ముంబయిలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. భారతదేశ తీర ప్రాంత భద్రత అంశంపై జరిగిన ఈ సమావేశానికి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. కేంద్ర గృహమంత్రిత్వ శాఖకు చెందిన సరిహద్దు నిర్వహణ విభాగం ఈ సమావేశాన్ని నిర్వహించింది.
7516 కి.మీ తీర రేఖ వెంబడి రక్షణకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించిన ఆయన కొన్ని అతి ముఖ్యమైన చర్యలు చేపట్టడం ద్వారా దేశ తీరప్రాంతాన్ని మరింత రక్షణాత్మకంగా చేయవచ్చని అభిప్రాయపడ్డారు. తీర రేఖ వెంబడి తీవ్రవాదం, దానిని ఎదుర్కొనేందుకు ఎదురౌతున్న ఆర్థిక పరమైన ఇబ్బందుల్ని ఈ సమీక్షలో మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. తీర ప్రాంత భద్రత పథకం అమలు, కేంద్రపాలిత/ రాష్ట్రాల్లో తీర ప్రాంత భద్రతకు సంబంధించి సంస్థాగత నిర్మాణం, స్టేట్ మారిటైం బోర్డ్ విధివిధానాలు, ప్రధాన పోర్టులు కాని పోర్టుల భద్రత, తీర ప్రాంత మేపింగ్, ద్వీపాల భద్రత, బయోమెట్రిక్ గుర్తింపు కార్డులు, కార్డ్ రీడర్ల పంపిణీ, పడవలకు కలర్ కోడింగ్, జాలర్లు చేపలు పట్టే ప్రదేశాల పర్యవేక్షణ, జాలర్లు అంతర్జాతీయ నావికా సరిహద్దు రేఖ (IMBL) దాటడం మొదలైన అంశాలపై చర్చ జరిగింది.
ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజ్జు, మహరాష్ట్ర ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, కర్ణాటక రాష్ట్ర హో మంత్రి డా. జి. పరమేశ్వర్, గుజరాత్ రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి రజనీ భాయ్ పటేల్, పుదుచ్చేరి రెవెన్యూ శాఖ మంత్రి . షాజహాన్, అండమాన్ నికోబార్ దీవుల లెఫ్ట్నెంట్ గవర్నర్ ఎ.కె.సింగ్, గోవా, మహారాష్ట్ర, అండమాన్ నికోబార్‌ల చీఫ్ సెక్రటరీలు, గుజరాత్ ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల డీజీపీలు, వివిధ శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.