శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అయోధ్య రామాలయం
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2020 (18:34 IST)

వెండి ఇటుకతో రామమందిరానికి భూమిపూజ... (video)

కోట్లాది మంది హిందూ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనుంది. శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగనుంది. ఇందుకోసం ఆగస్టు ఐదో తేదీన భూమిపూజ జరుగనుంది. ఇందుకోసం 40 కేజీల వెండి ఇటుకను ఉపయోగించనున్నారు. మూలవిరాట్టు కింద ఈ వెండి ఇటుకను పెట్టనున్నారు. ఇదే భూమిపూజగా భావించనున్నారు. 
 
ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో కేవలం 50 మంది వీవీఐపీలు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని కోవిడ్ నిబంధనలకు లోబడి నిర్వహించనున్నారు. అయితే, ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వీలుగా అయోధ్య నగర వ్యాప్తంగా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్క్రీన్ల ద్వారా భక్తులు భూమి పూజను వీక్షించేలా ఏర్పాటు చేస్తున్నారు.
 
ఇదే అంశంపై శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్ మాట్లాడుతూ, గర్భగుడిలో దేవుడిని ప్రతిష్ఠించే ప్రాంతంలో 40 కేజీల వెండి ఇటుకను ఉంచబోతున్నట్టు తెలిపారు. దీనినే పునాదిరాయిగా ప్రధాని చేతుల మీదుగా ప్రతిష్టించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. 
 
ప్రధాన కార్యక్రమానికి మూడు రోజుల ముందు నుంచి వేద శాస్త్రాలను అనుసరించి క్రతువులు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీని ఆహ్వానించామన్నారు. అయితే ఆయన ఏ రోజు వస్తారనే విషయాన్ని ప్రధాని కార్యాలయం ఇంకా నిర్ధారించలేదని చెప్పారు. కాకపోతే, 5వ తేదీని ఆయన వస్తున్నట్టు తమకు సమాచారం ఉందని తెలిపారు.
 
అలాగే, అయోధ్య ఉద్యమంతో సంబంధం ఉన్న సీనియర్ బీజేపీ నేతలందరినీ ఆహ్వానించామని ట్రస్ట్ తెలిపింది. సీనియర్ నేతలైన ఎల్కే. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతి, వినయ్ కతియార్, సాధ్వి రితంభర తదితరులంతా ఈ జాబితాలో ఉన్నారని వెల్లడించింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌తో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపింది.