నాకు ఏమైనా అయితేనే స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారు : కరుణానిధి
తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి పదవిని తానే చేపడుతానని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అన్నారు. వచ్చే ఎన్నికల్లో డీఎంకే గెలిస్తే స్టాలిన్ సీఎం అవుతారంటూ సాగుతున్న దుష్ప్రచారంపై ఆయన స్పందించారు.
'ప్రకృతి నన్నేమైనా చేసేదాకా సీఎం అవడానికి నా కుమారుడు స్టాలిన్ వేచి ఉండాల్సిందే' అని స్పష్టంచేశారు. డీఎంకే విజయం సాధిస్తే యువకుడికి పాలనపగ్గాలు అప్పగించేందుకు మార్గం సుగమం చేస్తారా అని అడుగగా.. తానే ప్రభుత్వానికి సారథ్యం వహిస్తానని ఆయన బదులిచ్చారు. 'సీఎం అవ్వాలని స్టాలిన్ కూడా అనుకోవడం లేదన్నారు.
డీఎంకే అధ్యక్షుడే (నేనే) ఆ పదవిని అధిష్టించాలని కోరుకుంటున్న వారిలో ఆయనే ప్రథముడు. 1957 నుంచి ఒక్క ఎన్నికలో కూడా నేను ఓడిపోలేదు. ఈ దఫా నేను గెలిస్తే ఆరోసారి సీఎంను అవుతాను' అన్నారు. స్టాలిన్‌ను సీఎం చేయాలని పార్టీ నేతలు కోరుకుంటే ఏం చేస్తారన్న ప్రశ్నకు ఆయనకు ఆ అవకాశం రావాలంటే ప్రకృతి తననేమైనా చేయాలని జవాబిచ్చారు. స్టాలినే తన వారసుడని ఇదివరకే కరుణ సంకేతాలిచ్చారు.