1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 29 జూన్ 2025 (17:09 IST)

జగన్నాథ రథయాత్రలో అపశృతి : ముగ్గురి మృతి

Secunderabad Sri Jagannath Rath Yatra
ఒరిస్సా రాష్ట్రంలోని పూరీలో జరుగుతున్న జగన్నాథ రథ యాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుండిచా ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో యాత్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 
 
జగన్నాథ ఆలయం నుంచి ప్రారంభమైన రథయాత్రలో భాగంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి విగ్రహాలతో కూడిన మూడు పవిత్ర రథాలు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయానికి చేరుకున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో రథాలు గుండిచా ఆలయం వద్దకు రాగానే, స్వామివార్ల దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. 
 
రథాలు సమీపించే కొద్దీ ఒక్కసారిగా జనసందోహం పెరిగిపోయింది. ఈ క్రమంలో కొందరు భక్తులు కిందపడిపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను ప్రభాతి దాస్, బసంతి సాహు, ప్రేమకాంత్ మహంతిగా గుర్తించారు. వీరంతా పూరీ రథయాత్ర కోసం జిల్లా నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. 
 
గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన జరిగిన ప్రదేశంలో గుంపును నియంత్రించడానికి పోలీసులు సరైన ఏర్పాట్లు చేయలేదని స్థానిక మీడియా కథనాలు ఆరోపించాయి.