పాకిస్థాన్ యువతిని రాజస్థాన్ కోడలిని చేయనున్న సుష్మా స్వరాజ్
భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మరోమారు గొప్ప మనసును చాటుకున్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నరేశ్ తేవానీతో పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ ప్ర
భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ మరోమారు గొప్ప మనసును చాటుకున్నారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నరేశ్ తేవానీతో పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ ప్రియా బచ్చనీ వివాహానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.
మూడేళ్ల క్రితం వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. అప్పట్నుంచి రెండు కుటుంబాల మధ్య రాకపోకలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సర్జికల్ స్ట్రయిక్స్‌తో రెండు దేశాల మధ్య విభేదాలు రాజుకున్నాయి. దీంతో నవంబర్ 7న జోధ్‌పూర్‌లో జరగాల్సిన వీరి వివాహం జరుగుతుందా? అనే అనుమానం రెండు కుటుంబాల్లో నెలకొంది. పాకిస్థాన్‌లోని భారత్ ఎంబసీ వీసాలు ఇవ్వడం ఆపేసింది.
దీంతో వివాహం కోసం 3 నెలలుగా ప్రయత్నిస్తున్న ప్రియ కుటుంబంలో ఆందోళన నెలకొంది. దీంతో నరేష్ తేవానీ తండ్రి నేరుగా విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కి, పీఎంవోకు తమ వివాహ ఇబ్బందులు తెలిపారు. దీనిపై స్పందించిన సుష్మ సాయం చేస్తానని మాట ఇచ్చారు. ఇచ్చినట్టే ప్రియ కుటుంబ సభ్యులకు వీసా మంజూరు చేయాలని ఇస్లామాబాద్‌లోని భారత ఎంబసీని ఆదేశించారు. దీంతో జస్ట్ రెండు రోజుల్లోనే ప్రియ, మరో 11 మంది కుటుంబ సభ్యులకు భారత ఎంబసీ వీసాలు మంజూరు చేసింది.
అలాగే, మరో ఘటనతో విధి నిర్వహణలో నిబద్ధతతో ఆమె కోట్లాది మంది భారతీయుల మనసులను గెలుచుకున్నారు. ఆమె మానవత్వానికి, నిబద్ధతకు మారుపేరుగా నిలిచిన ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం సరితా ఠాక్రూ అనే భారతీయ మహిళ భర్త మరణించారు. ఆయన అంత్యక్రియలు పూర్తిచేయాల్సిన కుమారుడు అభయ్ కౌల్ అమెరికాలో ఉండిపోయాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో బాధితురాలు సుష్మా స్వరాజ్‌కు ట్వీట్ చేశారు.
'మానవతా కోణంలో మా అబ్బాయికి వీసా ఇప్పించండి, ఈ ఒక్క సాయం చేయండి, ఇలాంటప్పుడు కూడా సాయం చేయకపోతే ఎలా?' అంటూ ఆమె తన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని చూసిన సుష్మ స్వరాజ్ 'ఒక్క నిమిషం.. కనుక్కుంటానని' పోస్ట్ పెట్టి, ఆ వెంటనే సమాధానం ఇచ్చారు. ఈ రోజు దసరా, రేపు మొహర్రం కావడంతో ఎంబసీకి సెలవులని, సిబ్బంది విధులకు దూరంగా ఉన్నారని ఆమె మళ్లీ సమాధానమిచ్చారు. తర్వాత మూడోసారి ట్వీట్ చేసిన కేంద్ర మంత్రి...'మీ కోసం ఎంబసీని తెరిచాము. అభయ్ కౌల్‌కు వీసా మంజూరు చేశామని, ఇప్పుడతను భారత్ వచ్చేందుకు ఎలాంటి ఇబ్బంది లేద'ని తెలిపారు. దీంతో నెటిజన్లు సుష్మా స్వరాజ్‌ను వేనోళ్ల పొగుడుతున్నారు.