శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr

తమిళనాడు ప్రైవేట్ పాలలో కల్తీ.. ఆ జాబితాలో హెరిటేజ్ కూడా ఉందా? ఉరికి సిద్ధమని మంత్రి ప్రకటన

తమిళనాడు రాష్ట్రంలో ప్రైవేట్ కంపెనీలు సరఫరా చేస్తున్న ప్రైవేట్ పాలలో కల్తీ జరుగుతున్నట్టు ఆ రాష్ట్ర పాడిపరిశ్రమల శాఖామంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ సంచలన ఆరోపణలు చేశారు. ఒకటి రెండు మినహా ఆనేక ప్రైవేట్ పా

తమిళనాడు రాష్ట్రంలో ప్రైవేట్ కంపెనీలు సరఫరా చేస్తున్న ప్రైవేట్ పాలలో కల్తీ జరుగుతున్నట్టు ఆ రాష్ట్ర పాడిపరిశ్రమల శాఖామంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ సంచలన ఆరోపణలు చేశారు. ఒకటి రెండు మినహా ఆనేక ప్రైవేట్ పాల డైరీలు రసాయనాలు కలిపిన పాలను సరఫరా చేస్తున్నాయని ప్రకటించారు. పైగా, ప్రైవేట్ పాలలో రసాయనాలు లేవు అని నిరూపిస్తే, ఉరి కంభంలో వేలాడేందుకైనా తాను సిద్ధమని ఆయన ప్రకటించడం ఇపుడు సంచలనంగా మారింది. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండేందుకు వీలుగా పాలలో ఫార్మా డిలైట్ అనే రసాయనాన్ని కలిపి ప్యాకెట్లలో పాలను విక్రయిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పరిశోధనల ద్వారా గుర్తించినట్టు చెప్పారు. ప్రభుత్వ పరిశోధనా కేంద్రంలో సాగిన పరిశీలనలో కొన్ని రకాల మిశ్రమాలతో ఫార్మా డిలైట్‌ అన్న రసాయనాన్ని గుర్తించడం జరిగిందన్నారు. మైసూర్‌లోని కేంద్ర ప్రభుత్వ పరిశోధనా కేంద్రానికి సైతం శాంపిల్స్‌ పంపించామని, అక్కడి నుంచి నివేదిక రాగానే, ప్రైవేటు పాల సంస్థల భరతం పట్టే విధంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. 
 
తాను ఎన్నడూ ప్రైవేట్ పాల సంస్థల వద్ద చేతులు చాచ లేదని, అవినీతికి పాల్పడాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. ప్రైవేటు పాలలో రసాయనాలు లేవు అని నిరూపిస్తే, పదవికి తానే రాజీనామా చేస్తానని, ఉరి కంబంలో వేలాడేందుకు కూడా సిద్ధం అని స్పష్టం చేశారు. గత ఏడాది ఈ శాఖ మంత్రిగా తాను పగ్గాలు చేపట్టిన కొన్ని నెలల్లోనే రసాయనాల వ్యవహారం ఫిర్యాదు రూపంలో చేరిందని, రహస్యంగా విచారించి, నిర్ధారించుకున్న అనంతరం ప్రస్తుతం బయట పెట్టానంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. రాజీనామాకు ఒత్తిడి తెచ్చినా, ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా, ప్రైవేటు పాల రసాయనాల భరతం పట్టే విషయంలో తాను వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.