ముగ్గురిని బలితీసుకున్న రాంగ్ కాల్... భర్త అనుమానించాడనీ...
తమిళనాడు రాష్ట్రంలోని తెన్‌కాశీలో విషాదం జరిగింది. భర్త అనుమానించడాన్ని జీర్ణించుకోలేని ఓ మహిళ.. నిద్రపోతున్న తన ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది.
తమిళనాడు రాష్ట్రంలోని తెన్‌కాశీలో విషాదం జరిగింది. భర్త అనుమానించడాన్ని జీర్ణించుకోలేని ఓ మహిళ.. నిద్రపోతున్న తన ఇద్దరు పిల్లలపై కిరోసిన్ పోసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... తెన్‌కాశికి చెందిన ఇసక్కి, మహేశ్వరి (27) అనే దంపతులు ఉండగా, వీరికి షణ్ముగరాజ్(8), ధనశ్రీ(4) అనే ఇద్దరు పిల్లలున్నారు. పచ్చి తాగుబోతు అయిన ఇసక్కి... భార్యపై అనుమానంతో నిత్యం గొడవపడుతుండేవాడు. సోమవారం రాత్రి కూడా పూటుగా మద్యం తాగేసి వచ్చిన భర్త.. భార్యతో గొడవపడ్డాడు.
ఈ నేపథ్యంలో మంగళవారం వేకువజామున 4 గంటల ప్రాంతంలో మహేశ్వరి సెల్‌ఫోన్‌కు ఓ కాల్ వచ్చింది. అది రాంగ్‌కాల్ కావడంతో ఫోన్ కట్ చేసి మళ్లి నిద్రకు ఉపక్రమించింది. అయితే, ఫోన్ రింగ్ శబ్దాన్ని ఆలకించిన ఇసక్కి... నిద్రలేచి వచ్చి ‘ఏ ప్రియుడితో మాట్లాడుతున్నావ్’ అంటూ బూతులు తిట్టాడు.
అది రాంగ్ కాల్ అని, ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో తనకు తెలియదని.. మహేశ్వరి ఎంత నచ్చజెప్పినా అతను వినిపించుకోకుండా అసభ్యంగా మాట్లాడటంతో మహేశ్వరి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆ సమయంలో భర్త స్నానానికి వెళ్లగానే.. నిద్రపోతున్న తన ఇద్దరు పిల్లలపై కిరోసిన్ కుమ్మరించి, తనపై కూడా పోసుకుని నిప్పంటించుకోవడంతో ముగ్గురు చనిపోయారు.