గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

కరోనా రోగి అంత్యక్రియలను అడ్డుకుంటే మూడేళ్ల జైలు

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ఇలా చనిపోతున్న రోగుల మృతదేహాలకు అంత్యక్రియల నిర్వహణ పెను సవాల్‌గా మారింది. అనేక ప్రాంతాల్లో కరోనా రోగుల అంత్యక్రియలను స్థానికులు అడ్డుకుంటున్నారు. అటు తమిళనాడుతో పాటు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం స్పందించి, అత్యవసర ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. 
 
ఈ ఆర్డినెన్స్ మేరకు.. కరోనా రోగుల అంత్యక్రియలను ఎవరైనా అడ్డుకుంటే దాన్ని నేరంగా పరిగణిస్తారు. అలాగే, మూడేళ్ళ జైలు లేదా అపరాధం లేదా రెండింటిని విధించేలా ఆర్డినెన్స్ రూపకల్పన చేశారు. ఈ ఆర్డినెన్స్‌ను తమిళనాడు ప్రజా ఆరోగ్య చట్టం (తమిళనాడు పబ్లిక్ హెల్త్ యాక్ట్) ప్రకారం తెచ్చారు. ఈ చట్టం మేరకు కరోనా సోకి మరణించిన వ్యక్తి అంత్యక్రియలను, దహన లేదా అంత్యక్రియల ప్రక్రియను అడ్డుకుంటే నేరంగా పరిగణిస్తారు. జరిమానాతో పాటు ఒకటి నుంచి మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. 
 
ఇటీవల నెల్లూరుకు చెందిన ఓ వైద్యుడుతో పాటు.. మరో వైద్యుడు ఈ కరోనా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. వీరి అంత్యక్రియలను స్థానికులు తీవ్రంగా అడ్డుకున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందాయి. దీంతో తమిళనాడు ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను చేసింది.