శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 22 మార్చి 2017 (04:19 IST)

అవును మరి.. అలా అనకపోతే ఆయన మోదీనే కాడు మరి!

దేశమంతటా బీజేపీ జెండా ఎగరేయాలని కంకణం కట్టుకున్న నరేంద్రమోదీ తాను ప్రధానిగా ఉన్నంతవరకు కాస్త క్రమశిక్షణను పాటించండి లేకపోతే ఊరుకోను అంటున్నారు.

భారత రాజకీయాల్లో అటు మంత్రులను, ఇటు ఎంపీలను ఇంకా ఉద్యోగులను కూడా క్రమశిక్షణ విషయంలో గజగజలాడిస్తున్న ప్రధాని ఒకే ఒక్కడు. ఆయనే నరేంద్రమోదీ. అది నియంతృత్వం అనండి. క్రమశిక్షణ పాదుకొల్పడానికి తప్పనిసరిగా ప్రదర్సిస్తున్న కాఠిన్యం అనండి. ఇప్పుడు మోదీ సొంత పార్టీలోని సీనియర్ నేతలకు కూడా వణుకు తెప్పిస్తున్నారు. ఎందుకు అంటే నాలుగు ఓట్లు తేలేదే అని కాదు. ఆ పని తానే చేస్తున్నారాయె. దేశమంతటా బీజేపీ జెండా ఎగరేయాలని కంకణం కట్టుకున్న నరేంద్రమోదీ తాను ప్రధానిగా ఉన్నంతవరకు కాస్త క్రమశిక్షణను పాటించండి లేకపోతే ఊరుకోను అంటున్నారు.
 
ఇంతకుముందే నార్త్ బ్లాక్‌లో ప్రదాని కార్యాలయంలో, మంత్రుల కార్యాలయాల్లో పనికి ఎగనామం పెట్టి వేళకు ఆపీసుకు రాని ఉద్యోగులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఉదయం 9 గంటలకే వారు ఆఫీసుల్లో ఉండేటట్టు చేసిన ఘనత మోదీది. ఇక తన మంత్రివర్గాన్ని ముంగాళ్లపై నిలబెట్టి మరీ నిజాయితీగా ఉండమని శాసిస్తున్న తొలి ప్రధాని మోదీ. దేశ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు కేబినెట్ సమావేశం ముగిసీ ముగియకుండానే వాటిని బయటకు చేరవేస్తూ ప్రజాద్రోహం తలపెడుతున్న మంత్రివర్గ సభ్యలు కొందరికి మోదీ గడ్డిపెట్టారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం సందర్భంగా కేబినెట్ మొత్తాన్ని సమావేశ గదిలోనే ఉంచి వారి వద్ద మొబైల్స్ కూడా లేకుండా చేసి పెద్ద నోట్ల రద్దు ప్రకటనకోసం మీడియాముందుకు వచ్చిన మోదీ క్రమశిక్షణ, బాధ్యత విషయంలో తానెంత చండశాసనుడో నిరూపించుకున్నారు. 
 
ఇప్పుడు తాజాగా పార్లమెంటుకు సరిగా రాని బీజేపీ ఎంపీల పనిపట్టడానికి సిద్ధమయ్యారు మోదీ. పార్లమెంటు సమావేశాలకు ఒక్కరోజు కూడా గైర్హాజరవ్వకుండా రావాలని.. నిర్లక్ష్యం చేయవద్దని పార్టీ ఎంపీలను ఆయన హెచ్చరించారు. తరచుగా అధిక సంఖ్యలో బీజేపీ ఎంపీలు సభకు హాజరుకావడం లేదని, కోరం కూడా లేకపోతున్న కారణంగా సభా కార్యక్రమాలు ఆలస్యం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
‘పార్లమెంటుకు హాజరవడం ఎంపీల కనీస బాధ్యత.. నేను చాలా పనులు చేయగలను.. కానీ మీకు బదులుగా ఉభయసభలకు హాజరుకాలేను’ అని మోదీ అన్నారు ఇకపై తాను ఎప్పుడంటే అప్పుడు ఎవరినైనా పిలవొచ్చని.. ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలని, ఆ మేరకు తనకు హామీ ఇవ్వాలని బీజేపీ ఎంపీలను అడిగారు. సభకు హాజరు కావాలని వేరే వారితో చెప్పించుకునే పరిస్థితి ఉండకూడదని, అది వారి వ్యక్తిగత బాధ్యత అని గుర్తు చేశారు. 
 
ఆయన విధానాలు ఏవైనా కావచ్చు, లక్ష్యం ఏదైనా కావచ్చు. కానీ పదవులను అనుభవించడానకి కాదు. కోట్ల మంది ప్రజల పట్ల బాధ్యత పడటమే ఎంపీలు, రాజకీయ నేతల కర్తవ్యం అంటూ మోదీ చేస్తున్న హితబోధ స్వాతంత్ర్యానంతర భారత రాజీకీయాల్లో కొత్త పరిణామం.