వయనాడ్ లోక్‌సభ బైపోల్ : నామినేషన్ దాఖలు చేసిన ప్రియాంకా గాంధీ
కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లోక్‌సభకు జరుగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో ఆమె బుధవారం నామినేషన్ పత్రాలను సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆమె నామినేషన్ దాఖలు చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి రెండు చోట్లా గెలుపొందారు. ఆ తర్వాత ఆయన వయనాడ్ స్థానానికి రాజీనామా చేయడంతో ఇపుడు ఉప ఎన్నిక నిర్వహించాల్సి రాగా, కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ బరిలోకి దిగారు.
నామినేషన్ దాఖలుకు ముందు తన సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంకా రోడ్డు షో నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పూర్వ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ మాట్లాడుతూ వయనాడ్ ప్రజలకు తన మనసులో ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. తన సోదరి ప్రియాంక గాంధీని మించిన ప్రతినిధి ఎవరూ ఉండరని కితాబిచ్చారు. ఈ ఎన్నికల్లో ఆమె విజయం సాధిస్తుందని, పార్లమెంట్‌లో వయనాడ్ నుంచి శక్తిమంతమైన గొంతు అవసరమన్నారు. ప్రియాంకపై బీజేపీ నాయకురాలు నవ్య హరిదాస్, సీపీఐ సీనియర్ నేత సత్యన్ మోకెరి పోటీ పడుతున్నారు. నవంబరు 13న ఎన్నికలు జరగనుండగా 23న ఫలితాలు వెల్లడికానున్నాయి.