ప్రభవాది కాలచక్ర గమనములో ''శ్రీ విలంబి'' నామ సంవత్సరం 32వది. ఈ సంవత్సరం పేరు తెలుగు వాడకంలో విలంబి. నిత్యం చేసుకునే పూజా కార్యక్రమాల సంకల్పములలో సంస్కృత పదం విలంబ అని వాడవలెను. ప్రపంచ పరిస్థితి విషమంగా ఉండును. పంటలు అనుకున్నంతగా ఫలింపవు. ప్రజలు జీవనార్థం వివిధ దేశములు తిరిగెదరు. సమస్త ధాన్యముల ధరలు సరసముగా వుండును.
రాజకీయ నాయకుల మధ్య పరస్పర విరోధము. గోధుమలు, ధాన్యము, మిర్చి, మిరియాలు, కందులు, వేరుశెనగ, ఇంగువ, కొబ్బరికాయలు, కట్టెలు, కలప, పగడములు, కెంపులు, ముదుకనూలు, వస్త్రములు, మామిడిపండ్లు, వక్కలు, గుఱ్ఱములు, ఎర్రని పదార్థములు, గులాబిరంగు, తెల్లని రంగులకు విద్యుచ్ఛక్తిని కలుగజేయు వస్తువులకు, ఆవాలు, చర్మములు, రసాయన ఎరువులు, పశువుల ధరలు పెరుగును
నవనాయకులు
రాజు- రవి: రాజు రవి అవటం వల్ల ప్రభువులకు పరస్పర విరోధము, అల్పవృష్టి, ప్రజలకు ప్రభువు వలస శస్త్రముల వలన భయము, అగ్ని బాధలుండును. పంటలు తక్కువ. ప్రజలు దుర్మార్గుల వల్లను, చోరాగ్ని రోగ బాధలుండును. రాజు రవిగానున్న సంవత్సరములో రాజకీయ పరివర్తనము, రాజకీయ కల్లోలములుండును.
గోధుమలు, ధాన్యము, మిర్చి, మిరియాలు, కందులు, వేరుశెనగ, ఇంగువ, కొబ్బరికాయలు, కట్టెలు, కలప, పగడములు, కెంపులు, మదునూకలు, వస్త్రములు, మామిడిపండ్లు, వక్కలు, గుఱ్ఱములు, ఎర్రని పదార్థములు, గులాబిరంగు, తెల్లని రంగులకు, విద్యుచ్ఛక్తిని కలుగజేయు వస్తువులకు, ఆవాలు, చర్మములు, రసాయన ఎరువులు, పశువుల ధరలు పెరుగును.
మంత్రి - శని: శని మంత్రియగుటచే వర్షములు తక్కువై పంటలు తగ్గును. ప్రజలు దుర్మార్గులచే పీడింపబడుదురు. చోరరోగాగ్ని బాధలు, ధన, మాన ప్రాణహానులు కలిగియుందురు. ధాన్యాదుల ధరలు పెరుగును.
సేనాధిపతి - శుక్రుడు: సేనాధిపతి శుక్రుడు అవటం వల్ల సువృష్టి, సస్యసమృద్ధి. సుభిక్షము, ధాన్యాదులకు న్యాయమైన ధరలు ఉండును. వస్త్రములు దూది, నూలు, వ్యాపార వాటాల ధరలు, వెండి, బంగారం, నూనె ధరలు పెరుగును. స్త్రీ పురుషులు కామాసక్తులై యుందురు. స్త్రీల ధన, మాన ప్రాణహానిని కలుగజేయుదురు.
సస్యాధిపతి- కుజుడు: కుజుడు సస్యాధిపతియైన అన్ని దేశములలో సస్యానుకూల వర్షములుండును. శెనగలు మొదలగు ధాన్యములు, ఎర్రని భూములు బాగుగా పండును.
ధాన్యాధిపతి- రవి : సూర్యుడు ధాన్యాధిపతియైన మధ్యవృష్టి, స్వల్పపంటలు, ధరలు తగ్గుట మహాభయము కలుగును. ఎరుపు పంటలు బాగుగా పండును.
అర్ఘ్యాధిపతి- శుక్రుడు: సర్వధాన్యములు, వాటి ధరలు, వర్షములు అనుకూలముగా వుండును. అందు తెల్లధాన్యము బాగుగా ఫలించును. సుభిక్షము కలుగును. ఆహార ధాన్యములు, బియ్యం, పట్టు, రాగి, వస్త్రములు, దూది ధరలు వ్యాపార వాటాలు అనుకూల ధరలు కలిగి యుండును.
మేఘాధిపతి- శుక్రుడు: అతివృష్టి, సుభిక్షము, సస్యవృద్ధి, ప్రజలు ఆరోగ్యవంతులై యుందురు. గోవులు వ్యాధులు లేక పాలనిచ్చను.
రసాధిపతి- గురుడు: గురువు రసాధిపతియైన సస్యానుకూల వర్షములు కలిగి, వృభములు ఫలవంతములగును. పంటలు ఫలించును. దేశ క్షేమం, ప్రజారోగ్యం కలుగును.
నీరసాధిపతి- చంద్రుడు: చంద్రుడు నీరసాధిపతియై ముత్యములు, బంగారం, కంచు, వస్త్రములు నగలు సమృద్ధిగా ఉండును. అధిక ధరలు కలిగి వుండును.
పశుపాలకుడు - యముడు: పశుపాలకుడు యముడు అవడం వల్ల అల్పవృష్టి. ధరలు అధికం. పాడిపంటలు తక్కువ. పశువులకు రోగములు. పశునష్టము అధికము. నవనాయకులు 5 శుభాధిపత్యములు, 4 పాపాధిపత్యములు.
శ్రీ విలంబినామ సంవత్సర పీఠికా ఫలమ్
ఈ సంవత్సరం అక్టోబర్ వరకు తులలో బృహస్పతి ఆ తదుపరి వృశ్చికంలో, కర్కాటకంలో రాహువు, మకరంలో కేతువు, ధనస్సులో శని సంచరిస్తున్నారు. ఈ గోచారం పరీక్షించగా స్వదేశంలో కన్నా విదేశాల్లో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. ఆగస్టు వరకు అధిక ఎండలు ఎదుర్కొంటారు. చదువుల్లో విద్యార్థులు పోటీపడతారు. విద్యార్థునుస బలవత్తరమైన మరణాలు యధావిధిగా సాగుతాయి.
ఎండుమిర్చి, నూనెలు, పెట్రోలు ధరలు తారాస్థాయికి చేరుతాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, మెటీరియల్ కంజ్యూమర్ వస్తువులకు రాబడి బాగుగా ఉంటుంది. రాష్ట్ర, కేంద్ర నాయకులు అధిక సమస్యలు ఎదుర్కొంటారు. దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి అధిక ప్రయత్నం చేస్తారు. జరగబోవు రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీకి ఆశించినంత అభివృద్ధి ఉండదు.
ఫైనాన్సు, బ్యాంకు, చిట్‌ఫండ్ రంగాల్లో వారు సమస్యలు ఎదుర్కొంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. రైలు ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు అధికమవుతాయి. 04-05-2018 నుంచి విలంబి సంవత్సరం వైశాఖ బహుళ పంచమీ శుక్రవారం డొల్లుకర్తరీ ప్రారంభం అవుతుంది. ఈ సంవత్సరం స్త్రీ సంతతి అధికం అవుతుంది.
తెలుపు వర్ణం కలిగిన పంటలు బాగుగా పండుతాయి. వాతావరణంలో మార్పు కలిగిస్తుంది. మెట్టభూముల పంటలు బాగుగా ఉంటాయి. కంది, మినుము, మిర్చి ధరలు తారాస్థాయికి చేరతాయి. కూరగాయల ధరలు అధికం అవుతాయి. 11-05-2018 విలంబినామ సంవత్సరం వైఖాశ బహుళ ద్వాదశీ శుక్రవారం రవి కృత్తిక నక్షత్రం ప్రథమపాదములో ప్రవేశం చేయడం ద్వారా పెద్ద కర్తరీ ప్రారంభం అగును. రాజకీయ నాయకుల తొందరపాటు వల్ల వాగ్ధానాల వల్ల సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది.
వైద్యులు శస్త్రచికిత్సలు చేసేటప్పుడు మెళకువగా వుండాలి. మాటపడే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాల్లో అనుకున్నంత పురోభివృద్ధి ఉండదు. వివాహం కానివారు శుభవార్తలు వింటారు. చోరత్వాలు అధికం అవుతాయి. రక్షకభటులకు రక్షణ కరువవుతుంది. 29-05-2018 సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి రోజున రవి రోహిణీ రెండవ పాదంలో ప్రవేశించడం ద్వారా కర్తరీ త్యాగం అగును.
ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సామాన్యంగా ఉంటుంది. చేతిలో వున్న అవకాశాలను వదిలి అధికశ్రమ చేయాల్సి వస్తుంది. నిర్మాణ రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సిమెంట్, కలప, ఇటుక, ఇసుక వ్యాపారులకు పురోభివృద్ధి కానరాగలదు. సినిమా కళాకారులు అపవాదులకు లోనవుతారు.
27-07-2018 ఆషాఢ పూర్ణిమ, శుక్రవారం కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణం మకరరాశిలో ఏర్పడటం వల్ల ఈ రాశివారు దీనిని చూడకుండా ఉండటం మంచిది. సినిమా రంగాల్లో వారికి అనుకున్నంత అభివృద్ధి ఉండజాలదు. పండ్ల వ్యాపరస్తులకు యోగదాయకంగా వుంటుంది.
11-10-2018 రా.7.20 నిమిషాలకు స్వస్తిశ్రీ విలంబి నామ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ తదియ గురువారం గురుడు విశాఖ 4వ పాదంలో వృశ్చికరాశిలో ప్రవేశించిన కారణంగా సార్థత్రికోటి సహితభీమరథీ పుష్కరములు ప్రారంభం అవుతాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలో అధిక వర్షపాతం వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయి.
21-10-2018 విలంబినామ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ ద్వాదశినాడు శుక్రమౌఢమి ప్రారంభం అగును. ప్రజల్లో ఆధ్యాత్మిక పెరుగుతుంది. మతమార్పిడులు, సమస్యలు వంటివి అధికంగా ఎదుర్కొంటారు. రాహు ప్రభావం అధికంగా ఉన్నందువల్ల కుటుంబీకుల మధ్య భార్యాభర్తల మధ్య పెద్దల మధ్య అపోహలు, అవమానాలు తలెత్తుతాయి. విడిపోవడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది.
1-11-2018 విలంబినామ సంవత్సరం ఆశ్వీయుజ బహుళ నవమి నాడు శుక్రమౌఢమి త్యాగం అగును. రైస్ మిల్లర్లకు అశాంతి అధికం అవుతుంది. విదేశాలు వెళ్ళాలనుకునే విద్యార్థులు సమస్యలు ఎదుర్కొనవలసివస్తుంది. పశ్చిమ, దక్షిణం వైపు నుంచి తుఫాను, భూకంపాలు అధికం అవుతాయి. కొంతమంది స్వామిజీలు మాటపడే అవకాశం ఉంది. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు మీడియా రంగాల్లో వారికి మిశ్రమ ఫలితంగా ఉండగలదు.
13-11-2018 విలంబినామ సంవత్సరం కార్తీక శుద్ధ షష్ఠి నాడు గురుమూఢమి ప్రారంభం అగును. రాబడి కన్నా టాక్స్ వంటి సమస్యలు అధికం అవుతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారు సమస్యలు ఎదుర్కొంటారు. కొత్త కొత్త వాహనాలు దేశంలో దిగుబడి జరుగుతాయి. 14-01-2018న శ్రీ విలంబి నామ సంవత్సరం పుష్యశుద్ధ అష్టమి వెళ్ళగా నవమి సోమవారం నాడు అశ్వని నక్షత్రం నాడు రవి తులా లగ్నం నందు మకర సంక్రమణం జరుగుతుంది. ఈ మకర పురుషుని పేరు "ఘోర''.
తూర్పు, ఉత్తర ప్రయాణం చేయడం వల్ల భూకంపాలు, యుద్ధభయాలు, ఆకస్మిక అధిక వర్షపాతం, కలహాలు వంటివి ఉండగలవు. ఈ మకర పురుషు డు వ్యాఘ్రవాహనం కలిగి వున్నారు. ఘోరనామధేయం వలన శూద్రులకు అరిష్టము. అగరు జలస్నానం శుభములు కలుగును.
రక్తవస్త్రధారణం వలన యుద్ధము, చందన గంధ లేపనం వల్ల ఆరోగ్యం, జాజి పుష్పధారణం వలన యశోవృద్ధి, నీలాంబర ధారణం వలన యుద్ధం, రజిత పాత్ర ధారణ వల్ల రజిత నాశనం, పాయన భోజనం వలన దుర్భిక్షం, కదళీ ఫలభోణం వలన ఆరోగ్యం, వ్యాఘ్ర వాహనం వలన మృగనాశనం జరుగును. ఎక్కువ భాగం ప్రజలు ఆరోగ్య సమస్యలు కిడ్నీ, పొట్ట, నరాలకు చక్కెర వ్యాధి వంటి సమస్యలు అధికంగా ఎదుర్కొంటారు. మొత్తం మీద రాబడికి మించిన ఖర్చులు అధికంగా ఉన్నందువల్ల ప్రజలు ఆందోళనకు గురవుతారు.
శ్రీకాళహస్తిలో రాహువు, కేతువుల పూజ చేయించిన సర్వగ్రహదోష నివారణలు జరుగుతుంది. కనకదుర్గ అమ్మవారికి ఖడ్గమాల పూజించిన ఆరోగ్యాభివృద్ధి, పురోభివృద్ధి కలుగుతుంది. కాణిపాక సంకల్పసిద్ధి గణపతిని ఆవుపాలతో అభిషేకించి, గరికతో పూజించిన సకలకార్యప్రాప్తి కలుగును. తెనాలి వద్ద నున్న చిలువూరులో (త్రేతాయుగంలో) శ్రీ సీతారాముల చేత పశ్చిమ ముఖంగా ప్రతిష్టచేయబడిన సైకతలింగంను దర్శించిన, అభిషేకించిన సంతానాభివృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, పురోభివృద్ధి, విద్యాభివృద్ధి కలుగుతాయి.