బాలిక మిస్సింగ్ కేసు : గుంటూరు పోలీసులు చాలా గ్రేట్ అంటూ హైకోర్టు వ్యంగ్యాస్త్రాలు
పదో తరగతి బాలిక అదృశ్యం కేసులో గుంటూరు పోలీసులను ఉద్దేశించిన ఏపీ హైకోర్టు వ్యంగ్యాస్త్రాలు సంధించింది. గుంటూరు పోలీసులు చాలా గ్రేట్ అంటూ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ బాలిక మిస్సింగ్ కేసులో పోలీసుల నిర్లక్ష్యాన్ని హైకోర్టు తూర్పారబట్టింది.
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, గుంటూరు పట్టణం, పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గత జూన్ నెలలో ఓ బాలిక ట్యూషన్‌కు వెళ్లి అదృశ్యమైంది. దీనిపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, ఫిర్యాదు ఇచ్చిన మూడు నెలలు గడిచినా పోలీసులు మాత్రం ఆ బాలిక ఆచూకీ కనుగొనలేకపోయారు. దీంతో బాలిక తండ్రి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై బుధవారం విచారణకురాగా, పోలీసుల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నప్పటికీ ఒక బాలికను కనిపెట్టలేకపోవడం సిగ్గుచేటని అభిప్రాయపడింది. గతంలో ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి హోదా ఉన్న సమాచార హక్కు చట్టం చీఫ్ కమిషనర్‌ను పోలీస్ స్టేషన్‌కు రాకుండా అడ్డుకున్న ఘతన ఈ గుంటూరు పోలీసులదే అని, ఇలాంటి పోలీసులు ఉండటం పోలీసులకే సిగ్గు చేటు అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసు విచారణలో పోలీసులు సరైన స్ఫూర్తితో పని చేయడం లేదంటూ పేర్కొన్న కోర్టు.. గురువారం నాటికల్లా బాలికను తమ ముందు ఉంచాలని రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాను ఆదేశించింది.
