1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. amaravati : krishna business man murdered by brother in law in tenali

రూ.కోట్ల ఆస్తి అక్కకు దక్కదని బావను హత్య చేయించిన బామ్మర్ది.. ఎక్కడ?

murder
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. తన అక్కకు రూ.కోట్ల ఆస్తి దక్కదన్న అక్కసుతో బావ(అక్క భర్త)ను బామ్మర్ధి  హత్య చేయించాడు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేశారు. ఈ హత్యకు నిందితులు ఉపయోగించిన కారు, చోరీ చేసిన బంగారం, మొబైల్ ఫోన్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విజయవాడకు చెందిన ఉడ్‌ పాలిష్‌ వ్యాపారి చుక్క కోటి వీర నాగయ్య అలియాస్‌ నాగ మహేశ్‌ (55)కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కొన్నాళ్లుగా అతడు తెనాలికి చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. తన బావమరిది పగడాల రాజేశ్‌ పద్ధతి మార్చుకోమని పలుమార్లు చెప్పినా అతడు పట్టించుకోలేదు. 
 
మహేశ్‌ క్రమేణా తన వ్యాపారాన్ని తెనాలికి మార్చడంతోపాటు ఓ నివాసం తీసుకొని సదరు మహిళతో కలిసి ఉంటున్నాడు. విజయవాడలోని రూ.కోట్లు విలువ చేసే ఆస్తులు విక్రయించి మహిళకు ఖరీదైన భవనం కొనివ్వడానికి యత్నిస్తున్నాడు. అక్కకు, వాళ్ల పిల్లలకు చెందాల్సిన ఆస్తులన్నీ వేరే మహిళకు అప్పగిస్తున్నాడని రాజేశ్‌ ఆగ్రహించసాగాడు. 
 
రాజేశ్‌ స్నేహితుల ద్వారా బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఓలేరుకు చెందిన సుపారీ గ్యాంగ్‌ కొమరబత్తిన సందీప్, బుస్సా సంజయ్, కొప్పుల అపర్ణ అలియాస్‌ బుజ్జీ, దేవరకొండ మారుతి వరప్రసాద్‌లను కలిసి తన బావ హత్యకు రూ.4 లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. ఈ ముఠా తెనాలిలోని ఓ హోటల్‌లో పది రోజులు బస చేసి మహేశ్‌ కదలికలను పరిశీలిస్తూ పలుమార్లు రెక్కీ నిర్వహించారు. 
 
ఆగస్టు 29న గుంటూరులో ఓ కారును అద్దెకు తీసుకుని, అదే రోజు ద్విచక్రవాహనంపై వెళుతున్న మహేశ్‌ను సోమసుందరపాలెం వద్ద అడ్డగించి కిడ్నాప్‌ చేశారు. కరకట్టపై రేపల్లె వైపు వెళుతుండగా కారులోనే మహేశ్‌ గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. 32 గ్రాముల బంగారు గొలుసు, ఉంగరాన్ని అపహరించి ఓలేరు సమీపంలోని ఇసుక క్వారీ వద్ద మృతదేహాన్ని పాతిపెట్టారు. అయితే, 30వ తేదీన సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై తెనాలి రూరల్‌ సీఐ నాయుబ్‌ రసూల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి అసలు విషయాన్ని బయటపెట్టారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
September 04, 2026: శుక్రవారం నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?