శ్రీకాళహస్తిలో మరుగుదొడ్లు ఎక్కడ? పుణ్యక్షేత్రాన్ని గబ్బుగబ్బు చేస్తున్న భక్తులు
దక్షిణ కాశీగా, వాయులింగక్షేత్రంగా విరాజిల్లుతూ యేటా కోట్లాది రూపాయల ఆదాయం గడిస్తున్న శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడు వెలసిన క్షేత్రంలో మరుగు (మలమూత్ర విసర్జన)కు వెళ్ళాలంటే భక్తులతో పాటు,
దక్షిణ కాశీగా, వాయులింగక్షేత్రంగా విరాజిల్లుతూ యేటా కోట్లాది రూపాయల ఆదాయం గడిస్తున్న శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడు వెలసిన క్షేత్రంలో మరుగు (మలమూత్ర విసర్జన)కు వెళ్ళాలంటే భక్తులతో పాటు, ప్రయాణీకులు నరకయాతన అనుభవిస్తున్నారు. పట్టణంతో పాటు నాలుగు మాఢా వీధుల్లో సైతం ఎక్కడా మరుగుదొడ్లు లేకపోవడంతో కాల కృత్యాలు తీర్చుకోవడానికి స్థానికులతో పాటు.. భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. మాస్టర్ ప్లాన్ అంటూ శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారులు, అమృత పట్టణం అంటూ మున్సిపల్ అధికారులు, పాలకులు గొప్పలు చెప్పుకోవడం తప్ప కనీస అవసరాలు కల్పించలేకున్నారు.
శ్రీకాళహస్తీశ్వరాలయానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఒకప్పుడు భక్తుల సంఖ్య ఐదారు వేలకు మించేది కాదు. ఇప్పుడు 20 వేలు దాటుతోంది. ఇక పండుగలు, ఉత్సవాలు సంర్భంగా ఈ సంఖ్య 30 వేలను తాకుతోంది. ఇటీవల కాలంలో పట్టణం ఎప్పుడూ కిక్కిరిసి ఉంటోంది. అయితే పట్టణంలో ఎక్కడా కూడా మరుగుదొడ్లు ఏర్పాటు చేయలేదు. తిరుపతి మీదుగా శ్రీకాళహస్తికి భక్తులు అత్యధిక సంఖ్యలో విచ్చేస్తుంటారు. సూపర్ బజార్ కడలి వద్ద బస్సు దిగుతుంటారు. ఈ ప్రాంతంలో ఎక్కడాగానీ పబ్లిక్ మరుగుదొడ్లు లేవు. దీంతో బస్సుల్లో వచ్చే భక్తుల పరిస్థితి వర్ణణాతీతంగా ఉంది. కొత్తగా వచ్చే భక్తులకు ఆలయం ఎంత దూరం ఉందో తెలియదు. ఒకవేళ తెలిసినా అక్కడ మరుగుదొడ్లు ఉన్నాయో లేవో తెలియదు.
దీంతో బస్సులలో వచ్చే భక్తులు ఎక్కువ మంది స్థానికంగా ఉన్న ప్రైవేట్ లాడ్జీలనే ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేటు లాడ్జీల వారు రెట్టింపు అద్దెలను వసూళ్ళు చేస్తున్నారు. ఇక వివిధ పనుల నిమిత్తం పట్టణానికి వచ్చే గ్రామీణ ప్రజల పరిస్థితి అత్యంత దయనీంగా ఉంటోంది. పనుల నిమిత్తం వచ్చే ప్రయాణీకులకు అర్జంటయితే రోడ్లు పక్కనే కాలకృత్యాలు తీర్చుకోవాల్సి దుస్థితి ఏర్పడింది. పురుషులు ఏ రోడ్డుపక్కనే పనికానిచ్చేస్తున్నారు గానీ మహిళలైతే సిగ్గు విడిచి రోడ్డు పక్కన మూత్రవిసర్జన చేయలేక అలాగని అలాగే బిగబట్టుకుని ఉండలేక అగచాట్లు పడుతుంటారు. వీరి కష్టాలు ఏ ఒక్కరికీ పట్టడం లేదు.
తిరుపతి పట్టణంలో ఎక్కడ చూసినా మరుగుదొడ్లను మున్సిపల్, తితిదే అధికారులు నిర్మించారు. దీంతో భక్తులతో పాటు ప్రయాణీకుల అవసరాలను తీర్చుకునే వీలుంది. జిల్లాలో తిరుపతి తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న శ్రీకాళహస్తి పట్టణంలో మాత్రం మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. పట్టణమంతా కాకపోయినా కనీసం ముఖ్యమైన నాలుగు మాఢా వీధుల్లో అయినా పబ్లిక్ మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. భక్తులు ఎక్కువగా దిగే సూపర్ బజార్ కూడలి, స్వర్ణముఖి బస్టాండ్, బేరి వారి మండపం, తేరు వీధి, పెండ్లి మండపం తదితర ప్రాంతాల్లో మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తే భక్తులతో పాటు ప్రయాణీకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ విషయమై దేవస్థానం, మున్సిపాలిటీ అధికారులు దృష్టిసారించాల్సి ఉంటుంది. దేవస్థానంకు కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నదంటే భక్తుల ద్వారానే. అలాంటి భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత దేవస్థానంపై కూడా ఉంది. రోడ్లు పక్కనే కాలకృత్యాలు తీర్చుకోవడంతో ఆ ప్రాంతమంతా కంపుకొడుతోంది. ఫలితంగా మున్సిపాలిటీకి చెడ్డపేరు వస్తోంది. అందువల్ల మున్సిపాలిటీ కూడా ఈ విషయమై దృష్టి సారించాలి. స్వచ్ఛభారత్ అని గొప్పులు చెప్పుకుంటున్న పాలకులు పుణ్యక్షేత్రంలో అయినా కనీస వసతులు కల్పించి శుభ్రంగా ఉండేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
