త్రయంబకేశ్వరంలో పురుషుల ప్రవేశంపై నిషేధం ఎత్తివేత!
మహారాష్ట్ర, నాసిక్‌లోని ప్రఖ్యాత త్రయంబకేశ్వర ఆలయ గర్భగుడిలోకి పురుషులు కూడా ప్రవేశించవద్దంటూ ఇటీవల విధించిన నిషేధాన్ని ఆలయ బోర్డు తాజాగా ఉపసంహరించుకుంది. గర్భగుడిలోకి పురుషుల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఆలయ ట్రస్టీ ప్రకటించారు. త్రయంబకేశ్వర ఆలయ గర్భగుడిలోకి మహిళలకు ప్రవేశం నిషిద్ధం.
ఇటీవల బాంబే హైకోర్టు ఆలయ ప్రవేశం విషయంలో స్త్రీ, పురుష వివక్ష చూపరాదని.. దేవుడిని పూజించడం మహిళల ప్రాథమిక హక్కు అని ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో మహిళలకు ప్రవేశం కల్పించకుండా ఉండేందుకు త్రయంబకేశ్వర ఆలయ బోర్డు ఏప్రిల్ 3న పురుషులపైనా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
అయితే స్థానికులు, పలువురి నుంచి వస్తన్న ఒత్తిడితో త్రయంబకేశ్వర దేవస్థాన ట్రస్టు అత్యవసరంగా సమావేశమైంది. పురుషులకు గర్భగుడిలోకి ప్రవేశంపై విధించిన నిషేధాన్ని ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆలయ ట్రస్టీ ఒకరు సోమవారం వెల్లడించారు. దీంతో సోమవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య పురుషులు గర్భగుడి దర్శనం చేసుకున్నారు. మరోవైపు.. మహిళలకు గర్భగుడిలోకి ప్రవేశం కల్పించే అంశంపై ఆలయ ట్రస్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
