తిరుమలలో పెరిగిన రద్దీ.... తిరుపతి-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు
కలియుగ వైకుంఠం తిరుపతిలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. రెండవ శనివారంతో పాటు ఆదివారం కూడా శెలవు కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రకు చెందిన భక్తులు తిరుమలలో అధికంగా కనిపిస్తున్నారు. లక్ష మందికి పైగా భక్తజనం తిరుమలలో ఉన్నట్లు టిటిడి అధికారులు ఒక అంచనాకు వచ్చారు. రేపు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టిటిడి అధికారులు భావిస్తున్నారు.
నిన్న శ్రీవారిని 61,083 మంది భక్తులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి స్వామి దర్శనం 6 గంటల సమయం పడుతోంది. కాలినడకన భక్తులు 3 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వీరికి శ్రీవారి దర్శనం 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.79 కోట్లు.
తిరుపతి రైల్వే స్టేషనుకు మరో కొత్త రైలు రానుంది. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైలును దక్షిణమధ్య రైల్వే ప్రవేశపెట్టిందని ద.మ. రైల్వే సీనియర్ అధికారి కె.సత్యనారాయణ మీడియాకు తెలిపారు. తిరుపతిలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు బయలుదేరి విజయవాడ మీదుగా మరుసటి రోజు సోమవారం ఉదయం 5.50 నిమిషాలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తత్కాల్ ఛార్జీలతో టూటైర్, త్రీటైర్, ఏసీ సీటింగ్, స్లీపర్ తరగతులు అందుబాటులో ఉంచారు.
