9 నుంచి శ్రీశైలం - విజయవాడల మధ్య సీ ప్లేన్ ప్రయోగం
ఈ నెల 9వ తేదీ నుంచి శ్రీశైలం - విజయవాడ ప్రాంతాల మధ్య సీ ప్లేన్ ప్రయోగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. మొత్తం 14 సీట్లున్న ఈ సీ ప్లేన్‌ను డీ హవిల్లాండ్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ తయారు చేసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సీ ప్లేన్‌ను పున్నమి ఘాట్‌లో దీనిని ప్రారంభిస్తారు.
తొలి సీ ప్లేన్‌ను విజయవాడ - శ్రీశైలం మధ్య నడపాలని యోచిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే రెగ్యులర్ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. సీ ప్లేన్ ప్రయోగం నేపథ్యంలో కృష్ణానదిలోని పున్నమిఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ జెట్టీకి అధికారులు మెరుగులు దిద్దుతున్నారు. పున్నమిఘాట్ వద్ద బయలుదేరే విమానం శ్రీశైలంలోని పాతాళగంగ బోటింగ్ పాయింట్ వద్ద ల్యాండ్ అవుతుంది.
విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం, శ్రీశైల మల్లన్న ఆలయ సందర్శనకు వెళ్లే భక్తులకు సౌకర్యంగా ఉండేలా దీనిని రూపొందిస్తున్నారు. రెండో దశలో విశాఖ, నాగార్జున సాగర్, గోదావరి తదితర ప్రాంతాల్లోనూ సీ ప్లేన్లను నడపాలని ప్రభుత్వం యోచిస్తోంది.