బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 24 జనవరి 2024 (09:10 IST)

కాంగ్రెస్ గూటికి నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు? తర్వాత ఏమన్నారంటే....

brs mla's
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. అయితే ఆ పార్టీకి బొటాబొటీ మెజార్టీతో ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోస్తామంటూ భారత రాష్ట్ర సమితి నేతలు హెచ్చరికలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భారాసకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఇది తెలంగాణాలో సంచలనంగా మారింది. 
 
ముఖ్యమంత్రి రేవంత్‌ను కలిసిన వారిలో సునీతా లక్ష్మారెడ్డి, కొత్తకోట ప్రభాకర్ రెడ్డి, గూడెం మహీపాల్ రెడ్డి, మాణిక్ రావులు ఉన్నారు. మెదక్ జిల్లాకు చెందిన వీరంతా ముఖ్యమంత్రి నివాసంలో కలిసి, తమ జిల్లా అభివృద్ధికి సహకరించాలని సీఎంను కోరారు. కానీ, బయటమాత్రం మరో తరహా ప్రచారం సాగుతుంది. ఈ నలుగురుతో పాటు మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు సమాచారం. 
 
వీరి కలయిక రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. దీంతో ఆ నలుగురు ఎమ్మెల్యలు వివరణ ఇచ్చారు. తాము ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధితో పాటు తనతమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం మాత్రమే సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసినట్టు చెప్పారు. అనవసరంగా ఎలాంటి ఊహాగానాలు వద్దని మీడియాకు హితవు పలికారు. ఆ తర్వాత ఈ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిని కలిశారు. 
 
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి అదనపు భద్రత ఇవ్వాలని కోరారు. ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. అధికారిక కార్యక్రమాలలో లేదా పర్యటనలలో పోలీస్ ఎస్కార్టులు తొలగిస్తున్నారని వారు నిఘా అధిపతికి ఫిర్యాదు చేశారు. ప్రోటోకాల్ పాటించకపోతే శాంతిభద్రత సమస్య ఉత్పన్నమవుతుందని వారు చెప్పారు.