ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్

హైదరాబాద్ నగరంలో నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలు.. ఎందుకు?

charminar
హైదరాబాద్ నగరంలో రానున్న నెల రోజుల పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ నెల రోజుల పాటు ఎలాంటి సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. 
 
ఏక్ పోలీస్ విధానం అమలు, సస్పెండ్ చేసిన కానిస్టేబుళ్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బెటాలియన్ కానిస్టేబుళ్లు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఇది రోజురోజుకూ తీవ్రతరమవుతుంది. పైగా, యూనిఫామ్‌లతో వచ్చి సచివాలయాన్ని ముట్టడిస్తామని బెటాలియన్ కానిస్టేబుళ్లు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆంక్షలు విధించారు. 
 
నగరంలో నెల రోజుల పాటు ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. హింసాత్మక ఘటనలు, అశాంతిని రేకెత్తించడానికి పలు సంస్థలు, పార్టీలు ప్రయత్నిస్తున్నట్టు అందింన విశ్వసనీయ సమాచారం మేరకు ఈ ఆంక్షలు విధిస్తున్నామని ఆయన జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
 
ఈ ఉత్తర్వులు సోమవారం నుంచి వచ్చే నెల 28వ తేదీ వరకు అమల్లోకి ఉంటాయని వెల్లడించారు. ఈ సమయంలో సమావేశాలు, ర్యాలీలు, సభలు, ధర్నలు, రాస్తారోకోలను పూర్తిగా నిషేధిస్తున్నట్టు పేర్కొన్నారు. బీఎన్ఎస్ సెక్షన్ 163 కింద ఆంక్షలు విధించినట్టు తెలిపారు. ఆంక్షల్లో భాగంగా ఐదుగురికి మించి ఒక చోట గుమికూడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.