Rowdy Sheeter: రౌడీషీటర్ నందనవనం సూరి దారుణ హత్య
మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో నందనవనం సూరి అనే కుఖ్యాతి గాంచిన రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. సోమవారం రాత్రి వరంగల్, హైదరాబాద్, మల్కాజ్‌గిరి కమిషనరేట్ల పరిధిలో సూరిపై అనేక క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి. వీటిలో చాలా వరకు కేసులు అతని భార్య, బావమరిది సల్మాన్ హత్యలకు సంబంధించిన వివాదాలతో ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, సూరి తన రెండవ భార్య సోదరుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు నందనవనానికి వెళ్లాడు. అక్కడ సూరి ఉన్నాడని తెలుసుకున్న సల్మాన్ సోదరుడు అఫ్రోజ్ అక్కడికి చేరుకుని, సూరి కళ్లలో పెప్పర్ స్ప్రే చల్లి, పదునైన ఆయుధంతో దాడి చేసి ప్రాణాంతక గాయాలు కలిగించాడు.
తీవ్రంగా గాయపడిన సూరిని స్థానికులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నిందితుడి ఆచూకీ కనుగొనడానికి మరియు హత్యకు గల అసలు కారణాన్ని నిర్ధారించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
