సోమవారం, 3 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 మార్చి 2025 (19:50 IST)

అద్దెకు ఉన్న ఇంటి యజమానురాలి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

parvathamma - revanth
గతంలో తాను తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తిలో అద్దెకు ఉన్న ఇంటి యజమానురాలు నివాసానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం వెళ్లారు. సాధారణంగా తిన్నింటి వాసాలు లెక్కపెట్టే ఈ రోజుల్లో తాను ఎపుడో కొన్ని సంవత్సరాల క్రితం అద్దెకు ఉన్న ఇంటి యజమానురాలిని గుర్తు పెట్టుకుని ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళ ఇంటికి వెళ్లారు. ఆమెను పార్వతక్కా అంటూ ఆప్యాయంగా పలుకరించి, దగ్గరకు తీసుకుని ఫోటోలు దిగారు. రేవంత్ రెడ్డి మా ఇంటికి రావడాన్ని చూసిన ఆ మహిళ ఉబ్బితబ్బిబ్బులైపోయారు. సీఎం రేవంత్‌కు మంగళహారతితో పార్వతమ్మ కుటుంబం స్వాగతం పలికింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
ఇదిలావుంటే వనపర్తిలో ఆదివారం ప్రజాపాలన ప్రగతి బాట బహిరంగ జరిగింది. ఇందులో పాల్గొన్న సీఎం రేవంత్.. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నా, కిషన్ రెడ్డి సైంధవుడిలా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణాలో అధికార పీఠం నుంచి తన రహస్య మిత్రుడు దిగిపోయాడని కిషన్ రెడ్డి బాధపడుతున్నారని విమర్శించారు. 
 
మెట్రో రైలు రాలేదు. మూసీ ప్రక్షాళనకు నిధులు రాలేదు. వీటిని ఆపింది ఎవరు? ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం తన వల్లే మంజూరు అయిందని కిషన్ రెడ్డి చెప్పుకుంటున్నారు, మరి దక్షిణభాగం ఎవరి వల్ల ఆగిపోయింది? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 60 టీఎంసీల నీరు రావాల్సి ఉండగా, ఐదేళ్ల నుంచి పెండింగ్‌లో ఉంది దీన్ని ఆపింది ఎవరు? అంటూ ప్రశ్నించారు.