1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 జులై 2025 (15:06 IST)

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

ganja
ganja
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి చెలామణి జోరుగా సాగుతోంది. దీన్ని అరికట్టేందుకు పోలీసులు ఎన్నో రకాలైన చర్యలు చేపడుతున్నారు. అయినప్పటికీ గంజాయి అక్రమ రవాణా ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు సరికొత్త టెక్నాలజీతో ఓ అడుగు ముందుకేశారు. 
 
గంజాయి సరఫరాదారులతో పాటు దానిని వినియోగించే వారిని కూడా గుర్తించేందుకు ఇప్పుడు సరికొత్త టెక్నాలజీని ప్రయోగిస్తున్నారు. గంజాయి సేవించారా? లేదా? అని స్పాట్లోనే తేల్చేసేందుకు వీలుగా యూరిన్ టెస్ట్ కిట్లను అందుబాటులోకి తెచ్చారు.
 
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ విధానాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నారు. జిల్లా పరిధిలోని చౌటుప్పల్, భువనగిరి, బీబీనగర్, యాదగిరిగుట్ట వంటి కీలక పోలీస్ స్టేషన్‌కు ప్రభుత్వం ఈ యూరిన్ కిట్లను సరఫరా చేసింది. అనుమానం ఉన్న వ్యక్తుల మూత్ర నమూనాలను ఈ కిట్ల ద్వారా పోలీసులు పరీక్షిస్తున్నారు. 
 
పరీక్షలో పాజిటివ్‌గా తేలితే, ఆ వ్యక్తి గంజాయి సేవించినట్లు నిర్ధారించి, తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల భువనగిరి పట్టణంలో ఓ వ్యక్తికి ఇలాగే పరీక్ష చేయగా పాజిటివ్‌ అని తేలింది. 
 
ఈ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన వారిని కేవలం కేసులు నమోదు చేయడమే కాకుండా వారిని మత్తు నుంచి బయటపడేసేందుకు పునరావాస కేంద్రాలకు (రిహాబిలిటేషన్ సెంటర్లకు) పంపిస్తున్నారు. మరింత ఖచ్చితమైన నిర్ధారణ కోసం వారి రక్త నమూనాలను కూడా సేకరించి ల్యాబ్‌కు పంపిస్తున్నారు. 
 
ఈ విధానం ద్వారా గంజాయి వినియోగదారులను గుర్తించడమేకాకుండా వారికి గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది? ఎవరు సరఫరా చేస్తున్నారు? అనే కీలక సమాచారాన్ని రాబట్టి, గంజాయి నెట్‌వర్క్ నిర్మూలించాలని పోలీసులు లక్ష్యంగా పెట్టుకున్నారు.