వాన కురుస్తుందని పిల్లర్ కిందికెళితే ప్రాణం తీసింది... మౌనిక కుటుంబానికి రూ.20 లక్షలు
విధి ఆమె జీవితాన్ని కబళించింది. చినుకులు పడుతున్నాయని పిల్లర్ కింద తలదాచుకునేందుకు వెళ్లినందుకు ఆమె ప్రాణాలు కబళించింది ఆ పిల్లర్. అమీర్ పేట మెట్రో స్టేషనులో ఆదివారం నాడు ఈ ఘటన జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ రాజధాని అమీర్‌పేట స్టేషన్‌లో మెట్రో పిల్లర్‌కు చేసిన సిమెంట్ ప్లాస్టరింగ్ పెచ్చు ఊడి 30 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా మౌనిక అనే యువతిపై పడింది. అంతే... ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో నివసించే హరికాంత్ రెడ్డి భార్య మౌనిక ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కేపీహెచ్‌బీలో మెట్రో ఎక్కింది. ఆ సమయంలోనే మెల్లగా చినుకులు ప్రారంభమయ్యాయి. ఇంతలో ఆమె దిగాల్సిన స్టేషను అమీర్‌పేట వచ్చింది. బయటకు వెళ్దామని వచ్చినా వాన కురుస్తుండటంతో స్టేషన్ మెట్లకు సమీపంలోనే వున్న పిల్లర్ కింద కాసేపు ఆగి వెళ్దామనుకుని అక్కడికెళ్లింది. ఇంతలోనే పిల్లర్ పెచ్చులు ఊడి ఆమె తలపై పడ్డాయి. దీంతో ఆమె తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఐతే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు.
కాగా నాశిరకమైన పనుల కారణంగానే మౌనిక ప్రాణాలు కోల్పోయిందనీ, తమ కుటుంబానికి న్యాయం చేయాలంటూ గాంధీ ఆసుపత్రి వద్ద ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకి దిగారు. తొలుత ఇన్సూరెన్స్ మాత్రమే ఇస్తామన్న ఎల్ అండ్ టి అధికారులు ఆ తర్వాత వారి కుటుంబానికి రూ.20 లక్షల నగదు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడానికి అంగీకరించారు.