శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (19:08 IST)

పీఎం కేర్ ఫండ్స్‌కు రూ.కోటి బదిలీచేసిన పవన్ - టీఎస్ గవర్నర్ ప్రశంసలు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ మరోమారు ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల చెన్నై హార్బరులో చిక్కుకున్న శ్రీకాకుళం జాలర్లను ఆదుకునే విషయంలో పవన్ ప్రత్యేక చొరవ చూపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి దృష్టికి తీసుకెళ్లి జాలర్లను ప్రాణాలతో పవన్ కాపాడారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్... పవన్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు.
 
ఇపుడు మరోమారు పవన్‌ను ప్రశంసించారు. దీనికి కారణం లేకపోలేదు. కరోనా వైరస్ బాధితులను ఆదుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కేర్స్ ఫండ్‌ను నెలకొల్పారు. దీనికి పవన్ తనవంతుగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ నిధులను ఆయన నెఫ్ట్ ద్వారా బదిలీ చేశారు. దీనికి సంబంధించిన అక్నాలెడ్జ్‌మెంట్‌ను తన ట్విట్టర్ ఖాతాలో పవన్ షేర్ చేశారు. 
 
ఈ విషయం తెలుసుకున్న గవర్నర్ తమిళిసై... పవన్‌పై ప్రశంసలు కురిపించారు. పవన్ కల్యాణ్ చర్యలు లక్షలాది మంది ప్రజలకు మరింత స్ఫూర్తినిస్తాయని, దూరదృష్టిగల మన పీఎం ద్వారా దేశానికి సాయపడుతున్న పవన్ పెద్ద మనసుకు సెల్యూట్ అంటూ కొనియాడారు.