ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 27 జులై 2024 (12:44 IST)

అల్లరి నరేష్ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం ప్రారంభం

Allari naresh new movie opening
Allari naresh new movie opening
హాస్య చిత్రాలతో పాటు సీరియస్ కథలతో మూవీ చేస్తున్న అల్లరి నరేష్, వైవిధ్యభరితమైన చిత్రాలతోనూ అలరిస్తున్నారు. ఇటీవల ఆయన మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడం కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లో చేస్తున్నారు. రుహాని శర్మ కథానాయికగా నటిస్తోంది. నాగ వంశీ నిర్మాత.
 
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.29 గా రూపొందనున్న ఈ సినిమాని అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 30న ప్రకటించారు. ఆ సమయంలో విడుదలైన సంకేత భాషతో కూడిన కాన్సెప్ట్ పోస్టర్‌, ఎంతో సృజనాత్మకంగా ఉండి, సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలోనూ పోస్టర్ వైరల్ అయింది.
 
ఇప్పుడు చిత్రబృందం అధికారికంగా జూలై 27న పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభించింది. "ఫ్యామిలీ డ్రామా" చిత్రంతో ప్రశంసలు అందుకున్న రచయిత-దర్శకుడు మెహర్ తేజ్ ఈ చిత్రానికి రచన,  దర్శకత్వం వహిస్తున్నారు. వారం రోజుల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
 
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకట్ ఉప్పుటూరి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  ప్రముఖ స్వరకర్త జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.
 
జిజు సన్నీ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, రామకృష్ణ అర్రం ఎడిటర్ గా, విశాల్ అబానీ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.