ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 మార్చి 2021 (10:34 IST)

అమెరికా పోరాట యోధులతో తలపడుతున్న ఎన్టీఆర్ - చెర్రీ!

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 

భారీ బ‌డ్జెట్‌తో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా అక్టోబ‌రు 13వ తేదీన విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం చిత్ర క్లైమాక్స్ స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ నిక్ పావెల్ నేతృత్వంలో యాక్ష‌న్ సీన్స్‌కు సంబంధించిన షూట్ జ‌రుగుతుండ‌గా, ప‌తాక స‌న్నివేశాల‌లో భీకర పోరాటం కోసం అమెరికా నుండి 40 మంది యోధులు భారత్‌కు రప్పిస్తున్నారు.

40 మందితో జ‌క్క‌న్న చిత్రీక‌రించే క్లైమాక్స్ సీన్ ప్రేక్ష‌కుల స‌రికొత్త వినోదాన్ని పంచుతుంద‌న్నారు. 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని 1947 స్వాతంత్య్రానికి పూర్వం జరిగే హిస్టారికల్ డ్రామాగా తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, చ‌ర‌ణ్‌.. అల్లూరి సీతారామరాజుగా సంద‌డి చేయ‌నున్నారు. 

బ్రిటీష్ వారిపై పోరాటం చేసేందుకు ఈ ఇద్ద‌రు యోధులు చేతులు క‌ల‌ప‌నున్న‌ట్టు మూవీలో చూపించ‌నున్నారు. ఆర్.ఆర్.ఆర్‌లో అజయ్ దేవ్‌గణ్, అలియా భట్, ఒలివియా మోరిస్, రే స్టీవెన్సన్, అలిసన్ డూ, సముద్ర‌ఖ‌ని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ ప్రాజెక్టును రూ.400 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.