1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 జులై 2025 (12:49 IST)

టాయిలెట్ నుంచి వర్చువల్ విచారణకు హైజరైన నిందితుడు.. కోర్టు ఆగ్రహం

court
కోర్టు వర్చువల్ విచారణ జరుగుతుండగా ఓ వ్యక్తి టాయిలెట్ నుంచి హాజరుకావడం వివాదాస్పదమైంది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన గుజరాత్ హైకోర్టు సదరు వ్యక్తిపై సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.
 
జూన్ 20వ తేదీన జస్టిస్ నజీర్ ఎస్. దేశాయ్ ఓ కేసును వర్చువల్‌ గా విచారిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే, ఆ సమయంలో న్యాయమూర్తి ఈ విషయాన్ని గమనించలేదు. ఆ తర్వాత దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం కోర్టు దృష్టికి వచ్చింది. వీడియో ఆధారంగా, నిందితుడిని సూరత్‌లోని కిమ్ గ్రామానికి చెందిన అబ్దుల్ సమద్ అధికారులు గుర్తించారు.
 
ఈ ఘటనపై జూన్ 30న విచారణ చేపట్టిన జస్టిస్ ఏ.ఎస్.సుపేహియా, జస్టిస్ టీ.ఆర్. వచ్ఛనీలతో కూడిన ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడి చర్యలు కోర్టును అగౌరవపరిచేలా ఉన్నాయని పేర్కొంటూ అతనిపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
 
వైరల్ అయిన వీడియో ప్రకారం అబ్దుల్ సమద్ విచారణ సమయంలో టాయిలెట్లోకి వెళ్లి, కెమెరాలో తాను కనిపించేలా ఫోన్‌ను నేలపై పెట్టి కాలకృత్యాలు తీర్చుకున్నాడు. ఆ తర్వాత డిస్కనెక్ట్ అయి, మళ్లీ కాసేపటికి విచారణలో చేరాడు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతంకాకుండా ఎలాంటి సాంకేతిక చర్యలు తీసుకోవాలో సూచించాలని హైకోర్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.