సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 ఆగస్టు 2018 (15:08 IST)

భిన్న మనస్తత్వాల కలయికే చి.ల.సౌ (మూవీ రివ్యూ)

అక్కినేని కుటుంబానికి దగ్గరి సంబంధం ఉండి వెండితెరకు పరిచయమైన హీరోల్లో సుశాంత్ ఒకరు. హీరోగా పరిచయమై పదేళ్లు కావొస్తున్నా.. కెరీర్‌లో మాత్రం సరైన హిట్టూలేదు. హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ఆయన చే

చిత్రం : చి.ల.సౌ. 
నిర్మాణ సంస్థ‌లు: అన్న‌పూర్ణ స్టూడియోస్‌, సిరునీ సినీ కార్పొరేష‌న్‌
తారాగ‌ణం: సుశాంత్‌, రుహానీ శ‌ర్మ‌, వెన్నెల‌కిశోర్‌, అనుహాస‌న్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, సంజ‌య్ స్వ‌రూప్‌ తదితరులు
సంగీతం: ప‌్ర‌శాంత్ ఆర్‌.విహారి
నిర్మాత‌లు: నాగార్జున అక్కినేని, జస్వంత్ నడిపల్లి, భరత్ కుమార్ మలశాల, హరి పులిజల
ద‌ర్శ‌క‌త్వం: రాహుల్ ర‌వీంద్ర‌న్‌
 
అక్కినేని కుటుంబానికి దగ్గరి సంబంధం ఉండి వెండితెరకు పరిచయమైన హీరోల్లో సుశాంత్ ఒకరు. హీరోగా పరిచయమై పదేళ్లు కావొస్తున్నా.. కెరీర్‌లో మాత్రం సరైన హిట్టూలేదు. హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చేసిన ప్రయత్నమే "చి.ల.సౌ." ఈ చిత్రానికి యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున ఓ నిర్మాత కావడం గమనార్హం.
 
అయితే, ఇక్కడ ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే.. హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం. ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన‌ప్పుడు సినిమా గురించి పెద్ద‌గా ఎవ‌రూ పట్టించుకోలేదు. కానీ.. టీజ‌ర్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి సినిమాపై ఆస‌క్తి పెరిగింది. సినిమాను అన్న‌పూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేయ‌డానికి ముందుకు రావ‌డం ఈ సినిమాకు పెద్ద ప్ల‌స్ అయింది. మ‌రి సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే క‌థేంటో చూద్దాం.
 
క‌థ‌: 
అర్జున్‌(సుశాంత్‌) ఇర‌వైయేడేళ్ల కుర్రాడు. మంచి ఉద్యోగం చేస్తుంటాడు. అత‌ని త‌ల్లిదండ్రులు(అనుహాస‌న్‌, సంజ‌య్ స్వ‌రూప్‌) పెళ్లి చేసుకోమ‌ని వేధిస్తుంటారు. అర్జున్‌కేమో మరో ఐదేళ్లపాటు వ‌ర‌కు పెళ్లి చేసుకోకూడ‌ద‌నే ఆలోచ‌న ఉంటుంది. ఎవ‌రో ఇంటికి వెళ్లి అమ్మాయిని చూసి.. జీవితాంతం క‌లిసి ఉండ‌బోయే అమ్మాయిని 5 లేదా 10 నిమిషాల్లో ఎలా నిర్ణ‌యించుకుంటార‌నేది అర్జున్ వాద‌న‌. 
 
ఇలాంటి త‌రుణంలో అర్జున్ తల్లి... ఇంట్లోనే ఎవ‌రూ లేకుండా కేవ‌లం అర్జున్ మాత్రమే ఉండేలా అంజ‌లి(రుహానీ శ‌ర్మ‌)తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తుంది. అంజ‌లితో పెళ్లి ఇష్టం లేద‌ని ముందు అర్జున్ చెప్పేసిన త‌ర్వాత జ‌రిగే ప‌రిణామాల కార‌ణంగా ఆమెతో ఓ క‌నెక్ష‌న్ ఏర్ప‌డుతుంది. దాంతో ఆమె అంటే ఇష్టం ఏర్ప‌డుతుంది. 
 
అదేస‌మ‌యంలో అంజ‌లి త‌ల్లి(రోహిణి)కి ఆరోగ్యం స‌రిగా లేక‌పోవ‌డంతో అర్జునే ఆమెకు అన్ని విధాలుగా ఆదుకుంటాడు. త‌ర్వాత జ‌రిగే ప‌రిస్థితులు అర్జున్‌, అంజ‌లి మ‌ధ్య ఎలాంటి బంధాన్ని ఏర్ప‌రుస్తాయ‌నేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
 
విశ్లేష‌ణ‌: 
ఈ చిత్రంలో నటీనటుల విషయానికి వస్తే... సుశాంత్ ఏదో క‌మ‌ర్షియ‌ల్ హీరోగా రాణించాలన్న తాపత్రయంతో కెరీర్ ఆరంభంలో ఏవేవో ప్ర‌య‌త్నాలు చేశాడు. కానీ, త‌న బాడీ లాంగ్వేజ్‌కి త‌గినట్లు క‌థ‌ల‌ను ఎంపిక చేసుకోవాల‌నే ఆలోచ‌న‌ ఇన్నాళ్లకు వచ్చినట్టుగా ఉంది. ఈ చిత్రంలో అర్జున్ పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించాడు. హీరో పాత్ర మ‌న పక్కింటి కుర్రాడిలా ఉంటుంది. హీరోయిజం అనేది మచ్చుకైనా కనిపించదు. 
 
ఇక హీరోయిన్ రుహానీ శ‌ర్మ అంజ‌లి పాత్ర‌లో ఒదిగిపోయింది. తండ్రి చిన్న‌ప్పుడే చ‌నిపోయిన ఓ అమ్మాయి.. త‌న కుంటుంబం కోసం ప‌డే క‌ష్టం. దాని నుండి ఎలా మారుతుంది. త‌ల్లి కోసం ఎలాంటి తాపాత్ర‌యం ప‌డుతుంది. ఇలాంటి స‌న్నివేశాల్లో త‌ను చ‌క్క‌గా న‌టించింది. ఇక జ‌య‌ప్ర‌కాశ్‌, అనుహాస‌న్‌, సంజ‌య్ స్వ‌రూప్ త‌దిత‌రులు చ‌క్క‌గా న‌టించారు. ఇక హీరో స్నేహితుడి పాత్ర‌లో న‌టించి వెన్నెల‌కిషోర్ పండించిన కామెడీ ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తుంది.
 
చిత్రాన్ని టెక్నికల్‌పరంగా విశ్లేషిస్తే, రాహుల్ ర‌వీంద్ర‌న్ తొలి సినిమాను ఏదో బ్ర‌హ్మాండంగా తీసేయాల‌నికాకుండా పెళ్లి చూపులు అనే కాన్సెప్ట్‌పై సింపుల్ క‌థ‌ను చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించాడు. చిన్నచిన్న ఎమోష‌న్స్‌... హీరో హీరోయిన్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు.. కామెడీ స‌న్నివేశాలు.. అన్ని చాలా చ‌క్క‌గా రాసుకున్నాడు. పైగా, స్క్రీన్‌పై ఏమాత్రం గందరగోళం లేకుండా చెప్పాడు. 
 
అలాగే, హీరోగా ఉంటూ దర్శకుడిగా రాహుల్ క‌థ‌ను హ్యాండిల్ చేసిన తీరు మెచ్చుకోలుగా ఉంది. ఇక ప్ర‌శాంత్ విహారి పాట‌లు క‌థ‌లో భాగంగానే సాగిపోయాయి. ఆర్‌.ఆర్ బావుంది. సుకుమార్ కెమెరావ‌ర్క్ బావుంది. తొలి ప్ర‌య‌త్నంలో ఏదో కొత్త‌గా చెప్పాల‌ని కాకుండా తెలిసిన క‌థ‌ను కొత్త‌గా చెప్పాల‌ని రాహుల్ ప్ర‌య‌త్నం మంచి ఫలితాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. 
 
హీరో పెళ్లి వ‌ద్దునుకోవ‌డం.. చివ‌ర‌కు కావాల‌నుకోవ‌డం.. హీరోయిన్ ముందుగా పెళ్లి చేసుకోకూడ‌ద‌ని అనుకున్నా.. తల్లి కోసం పెళ్లి చూపులు చూడ‌టం.. హీరో.. హీరోయిన్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు.. అన్ని చాలా నీట్‌గా ఉన్నాయి. 
 
ఈ చిత్రం బలాలు, బలహీనతలను పరిశీలిస్తే, చిత్రంలో నటీనటుల ఎంపిక, వారి పాత్రలు మలచిన తీరు, కెమెరా వర్క్, సంగీతం చాలా అద్భుతంగా ఉంది. అలాగే, కామెడీ పార్ట్ స‌హా స‌న్నివేశాల‌ను.. ఎమోష‌న‌ల్‌గా న‌డిపించిన తీరు బాగున్నాయి. ఇకపోతే, మైన‌స్ పాయింట్లను పరిశీలిస్తే, కథ నెమ్మదిగా సాగడం, కొన్ని సీన్స్ అతికించిన‌ట్లు కనించడం బలహీనతగా చెప్పుకోవచ్చు.